Hyderabad Rains: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. ఉరుములు పిడుగులతో బీభత్సం.. పలు చోట్ల పవర్ కట్, ట్రాఫిక్ జామ్..
భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Heavy rains
Hyderabad Rains: హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే కుండపోత వానలతో నగరం అతలాకుతలమైంది. మరోసారి నగరంలో వర్షం కుమ్మేస్తోంది. శనివారం రాత్రి నగరంలో కుండపోత వాన పడుతోంది. ఉరుములు పిడుగులతో వాన కుమ్మేస్తోంది. భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరవ్యాప్తంగా వాన పడుతోంది. జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీనగర్ వరకు.. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు కుమ్మేస్తోంది. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, నాగోల్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం, చైతన్యపురి ఏరియాల్లో వాన దంచికొడుతోంది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయ ఏర్పడింది. పవర్ కట్ తో అంధకారం నెలకొంది. కుండపోత వాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
హయత్ నగర్ సర్కిల్ పరిధిలో 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్, ఎల్బీనగర్, గోశామహల్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలో 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. నగరంలోని రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని గంటల పాటు ఇలాగే వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు.
రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నగరం అంతా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి మార్గాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.
Also Read: అసలు రాజకీయాలే వద్దనుకుంటున్నా.. ఏ వైపు చూసేటట్లు లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు