Hyderabad Heavy Rain: వామ్మో.. హైదరాబాద్‌ను మరోసారి భయపెట్టిన జడివాన.. నిమిషాల వ్యవధిలో చెరువుల్లా రోడ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్..
లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad Heavy Rain: హైదరాబాద్ నగరాన్ని మరోసారి జడివాన భయపెట్టింది. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల కుండపోత వాన పడుతోంది. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి. రోడ్లపైకి నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టోలిచౌకి దగ్గర ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఐకియా నుంచి మాదాపూర్, కేపీహెచ్‌బీ వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెట్రో స్టేషన్ల కింద వర్షపు నీరు నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. నాలాలు, మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదైంది. మియాపూర్‌లో 9.7 సెం.మీ, లింగంపల్లిలో 8.2 సెం.మీ.. HCUలో 8.1 సెం.మీ, గచ్చిబౌలిలో 6.6, చందానగర్‌లో 6.4.. హఫీజ్‌పేట్‌లో 5.6, ఫతేనగర్‌లో 4.7 సెం.మీ వర్షపాతం రికార్డ్ అయ్యింది.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చూస్తుండగానే భారీ వర్షం కుమ్మేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, సుచిత్ర, గండి మైసమ్మ, దుండిగల్ కాప్రా, ఏఎస్‌రావు నగర్ తదితర ప్రాంతాల్లో జడివానకు రోడ్లు జలమయం అయ్యాయి.
యూసుఫ్‌గూడ కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్-హైటెక్ సిటీ చౌరస్తా వద్ద భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. రాయదుర్గం, అమీర్‌పేట, బంజారాహిల్స్ ఐకియా మార్గంలో తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మియాపూర్- చందానగర్ నగర్ మార్గంలో రహదారిపై మోకాలి లోతు నీరు నిలిచింది. దీంతో ముంబై జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా తొగుటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా శివంపేటలో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.