Heat Waves: ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు.

  • Published On : March 27, 2026 / 09:24 PM IST

 

Heat Waves: ఏపీలోని పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రేపు పలు జిల్లాలలోని మండలాల్లో తీవ్రమైన వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ బారిన పడకుండా కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరంజిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇక, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు.

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (68):
విజయనగరం 4, పార్వతీపురం మన్యం 7, పోలవరం 2, ఏలూరు 1, కృష్ణా 5, ఎన్టీఆర్ 9, గుంటూరు 16, బాపట్ల 1, పల్నాడు 21, ప్రకాశం జిల్లాల్లోని 2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

ఆదివారం 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 42.1°C, కడప జిల్లా కమలాపురంలో 42°C, పల్నాడు జిల్లా గురజాల, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 41.8°C, అనంతపురం జిల్లా తెరన్నపల్లి 41.6°C, కర్నూలు జిల్లా తోవిలో 41.4°C, కృష్ణా జిల్లా పెద్దపారుపూడి 41°C, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 40.4°C, మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 40.2°C, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లెలో 40.1°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 40°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలన్నారు.

Also Read: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఐటీఆర్, ఫుడ్ కూపన్ల నుంచి HRA భారీ మార్పులు.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే..!