Hot Summer: ఏపీ ప్రజలకు హెచ్చరిక.. 3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఎండల తీవ్రతపై ముందస్తు అలర్ట్ లు ఇవ్వాలని ఆర్టీజీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

  • Published On : March 25, 2026 / 08:01 PM IST

 

Hot Summer: అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. సమ్మర్ సుర్రు మంటోంది. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. స్టార్టింగ్ లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే.. ముందు ముందు మరెలా ఉంటుందో అనే భయం ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

ఈ క్రమంలో ఏపీలో ఎండలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. రానున్న మూడు నెలలు రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. ఈ హాట్ సమ్మర్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, జలవనరుల శాఖలకు సమన్వయ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో పశువులకు నీటి తొట్టెలు నింపాలని ఆదేశించారు.

కూలీలు ఉదయం 11లోపు పనులు ముగించాలని సూచించారు. పని స్థలాల్లో తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ఫస్ట్ ఎయిడ్ తప్పనిసరి చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, సౌకర్యాలు కల్పించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కోకు ఆదేశాలు ఇచ్చారు. హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2026 అమలు చేయాలన్నారు. స్టేట్, జిల్లా, డివిజన్ స్థాయిలో నోడల్ అధికారులను నియమించనున్నారు. ఎండల తీవ్రతపై ముందస్తు అలర్ట్ లు ఇవ్వాలని ఆర్టీజీఎస్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దని సూచించారు. వడదెబ్బ ప్రమాదంపై వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. శరీర ఉష్ణోగ్రత పెరిగి ప్రాణాపాయం కలగొచ్చన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గరిష్టంగా 42.6°C ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి నుంచి మే మధ్య వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేశారు.

Also Read: కేంద్రం సంచలనం.. వాళ్లందరి LPG గ్యాస్ కనెక్షన్స్ కట్.. వెంటనే మారకపోతే..