AP Heatwave: ఏపీలో భానుడి భగభగలు.. భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Heatwave Alert in AP: 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

  • Updated on- April 15, 2026 / 06:30 PM IST

Hot Summer AP Heatwave Alert

  • గురువారం పలు జిల్లాల్లో 43-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
  • నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపలో తీవ్ర వేడి పరిస్థితులు
  • ఉత్తరాంధ్ర జిల్లాలకు వడగాలుల హెచ్చరిక

AP Heatwave: ఏపీలో ఎండలకు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకు పెరుగుతోందని తెలిపింది. 275 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. ఓవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు వేడి గాలులు.. దీంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సమ్మర్ అయిపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఇక, గురువారం పలు జిల్లాల్లో 43-44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడపలో తీవ్ర వేడి పరిస్థితులు ఉంటాయి. 34 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 67 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. శుక్రవారం 28 మండలాల్లో తీవ్ర, 37 మండలాల్లో సాధారణ వడగాలులు ఉంటాయంది.

నంద్యాల సంజామలలో 44.6°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురజాల, కడప, మార్కాపురం ప్రాంతాల్లో 44°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఎండలో బయటకు రావద్దని సూచించారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండె, బీపీ, షుగర్ ఉన్న వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.

Also Read: ఏపీలో విషాదం… ఒకే ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్లు.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు