Weather Updates: ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు తీవ్రమైన ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

శుక్రవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

  • Published On : April 2, 2026 / 06:18 PM IST
  • మండిపోనున్న ఎండలు
  • రానున్న రెండు రోజులు భగభగలే
  • గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం
  • తీవ్ర వడగాలులు వీచే చాన్స్

Weather Updates: సమ్మర్ సుర్రుమనిపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎండల గురించి కీలక అలర్ట్ ఇచ్చింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఏపీలో రానున్న రెండు రోజులు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు 42-43°C వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 16 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. శనివారం 41 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.

శుక్రవారం (03-04-26) శ్రీకాకుళం జిల్లాలో 13, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 11, అల్లూరి 2, పోలవరం 3, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 2 మండలాల్లో తీవ్ర వడగాలులు (54) వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం 2, విజయనగరం 4, మన్యం 2, పోలవరం 1, అనకాపల్లి 2, కాకినాడ 1, తూర్పుగోదావరి 2, ఏలూరు 1, ఎన్టీఆర్ 1 మండలాల్లో వడగాలులు (16) ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

ఇక, గురువారం విజయనగరం జిల్లా రాజాంలో 40.6°C, మన్యం జిల్లా మక్కువ, చిత్తూరు జిల్లా నిండ్రలో 40°C, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 39.8°C, తిరుపతి జిల్లా రేణిగుంటలో 39.6°C, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 39.6°C, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, కృష్ణా జిల్లా కంకిపాడు, కర్నూలు జిల్లా తోవిలో 39.4°C, అనకాపల్లి జిల్లా నాతవరం, నంద్యాల జిల్లా ఆలమూరులో 39.3°C, కోనసీమ జిల్లా శివలలో 39.1°C, విశాఖ జిల్లా పద్మనాభం, అనంతపురం జిల్లా పాత కొత్త చెరువులో 39°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

వడగాలుల వీస్తున్నందున మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారు చేసిన పానీయాలు లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలన్నారు. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రసూచించారు.

Also Read: తల్లికిచ్చిన మాట కోసం… ఏకంగా 150 ఎకరాల భూమి దానం.. 30 మంది రైతుల పేరిట పట్టా