AP Hot Summer: నిప్పుల కొలిమిలా ఏపీ.. రాష్ట్రంలోనే అత్యధికంగా అక్కడ 48.3 డిగ్రీలు నమోదు.. మరో 3 రోజుల మంటలే..

సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • Updated on- May 24, 2026 / 07:21 PM IST

AP Hot Summer: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజురోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఈ సీజన్‌లోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. తణుకు, పిడుగురాళ్లలో 48.1°C ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.

రాష్ట్రంలో మరో 3 రోజులు తీవ్రమైన ఎండలు కొనసాగనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగొద్దని చెప్పింది. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలంది. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. వడదెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచనలు చేసింది.

ఇక రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 174 మండలాల్లో టెంపరేచర్లు 44°C దాటాయి. సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం 50 మండలాలకు తీవ్ర వడగాల్పులు, 205 మండలాలకు అలర్ట్ ఇచ్చింది. అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందంది.

Also Read: వడదెబ్బతో చనిపోతే రూ.4 లక్షలు పరిహారం.. దరఖాస్తు ప్రక్రియ, కావాల్సిన పత్రాలు ఇవే..