GHMC ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..
GHMC election: టీఆర్ఎస్ పునరాలోచనలో పడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి మళ్లీ ఆలోచిస్తుంది. GHMC పరిధిలో ఇటీవల సంభవించిన వరద ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందనే ఫీలింగ్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వరద సహాయక చర్యల్లో తలమునకలైన అథారిటీ స్వల్ప వ్యవధిలో ఎన్నికల సన్నాహాలు చేయలేమనే నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం.
పరిస్థితి కుదుటపడిన తర్వాతే GHMC ఎన్నికలు నిర్వహించాలనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీసుకెళ్లినట్లు సమాచారం. కనీసం 45 రోజుల తర్వాతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రపోజల్‌కు సీఎం ఒప్పుకుంటే డిసెంబర్ నెలాఖరులో షెడ్యూల్ రిలీజ్ చేసి జనవరి మూడో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని సమాచారం.
గ్రేటర్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ పూర్తిగా పాడైంది. ఇంకా పలు కాలనీల్లో బురద వాతావరణం కనిపిస్తుండటంతో అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగిపోయింది. అడుగు పెట్టే అవకాశం కూడా లేని పరిస్థితుల్లో తాత్కాలిక మరమ్మతులపై GHMC యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తోంది.
https://10tv.in/no-mask-no-vote-ghmc-elections-new-rules/
ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తే సన్నద్ధం కావడానికి అధికారులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 22 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీని ‘మినీ అసెంబ్లీ’గా పరిగణిస్తారు. అధికార యంత్రాంగాన్ని భారీగా మోహరించాల్సి రావడంతో ఎన్నికల వాయిదాకు అధికారులు మొగ్గు చూపుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని మినిష్టర్లు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫిరెన్స్ ద్వారా మీటింగ్‌లో పాల్గొన్నారు. గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కేటీఆర్‌ను కోరినట్లు సమాచారం. వరద బాధితులకు రూ.10 వేల చొప్పున పరిహారం పంపిణీ గందరగోళంగా మారిన ప్రస్తుత సమయంలో ఎన్నికలకు వెళ్తే వ్యతిరేకత వస్తుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.