CSKvsDC: ఢిల్లీని శాసించిన చెన్నై, 80 పరుగుల తేడాతో భారీ విజయం

చెన్నై సొంతగడ్డపై ఢిల్లీని శాసించింది. 180పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఢిల్లీని 80 పరుగుల తేడాతో ఘోరంగా చిత్తు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ వ్యూహాలకు క్యాపిటల్స్ ఒక్కో వికెట్ పేకమేడలా కుప్పకూలింది. ఒక్క కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(44; 31 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు)తో రాణించగా మిగిలిన వారంతా పేలవంగా అవుటై పెవిలియన్ చేరుకున్నారు. ధావన్(19) మినహాయించి మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమవడం ఢిల్లీని ఓటమికి చేరువచేసింది.
ఢిల్లీ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా(4), రిషబ్ పంత్(5), కొలిన్ ఇన్గ్రామ్(1), అక్సర్ పటేల్(9), రూథర్ ఫర్డ్(2), క్రిస్ మోరిస్(0), సుచిత్(6), అమిత్ మిశ్రా(8), ట్రెంట్ బౌల్ట్(1)తో సరిపెట్టుకున్నారు. చెన్నై బౌలర్లు ఇమ్రాన్ తాహిర్ 4వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 3. దీపక్ చాహర్ 1, హర్భజన్ సింగ్ 1 పడగొట్టారు.
అంతకంటే ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సొంతగడ్డపై ఢిల్లీ బౌలర్లపై సత్తా చాటింది. ఈ క్రమంలో ఢిల్లీకి 180పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త తడబడినా ఆచితూచి ఆడి వికెట్లు కాపాడుకుంది. క్రమంగా ఊపందుకుని బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించింది. తొలి వికెట్‌గా షేన్ వాట్సన్ నిరాశపరచినప్పటికీ డుప్లెసిస్(39)కు సురేశ్ రైనా(59; 37బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సు)తోడవడంతో చక్కటి భాగస్వామ్యం నమోదు చేశారు.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఎంఎస్ ధోనీ(44; 22బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సులు)కు రవీంద్ర జడేజా తోడై(25; 10బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులు)తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 18.3 ఓవర్లకు జడేజా అవుట్ అవడంతో అంబటి రాయుడు(5)పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించారు. ఢిల్లీ బౌలర్లకు సుచిత్ 2వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీయగలిగారు.
The @ChennaiIPL win by 80 runs and are now the table toppers in the #VIVOIPL Points Table ?? pic.twitter.com/LBXa118JlK
— IndianPremierLeague (@IPL) May 1, 2019