టాలీవుడ్‌లోనూ డ్రగ్స్ కలకలం, బాలీవుడ్‌ నుంచి పాకిన విష సంస్కృతి, తెరపైకి ప్రముఖుల పేర్లు

  • Publish Date - September 7, 2020 / 08:51 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెరపైకి డ్రగ్స్ వ్యవహారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ తో పాటు శాండల్ వుడ్ కూడా షేక్ అవుతోంది.

బాలీవుడ్, శాండల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం:
సుశాంత్ సింగ్ కేసుని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సీబీఐ అధికారులు బాలీవుడ్, శాండల్‌వుడ్‌తో ముడిపడి ఉన్న డ్రగ్స్‌ రాకెట్‌ డొంకను కదిలించారు. టాలీవుడ్‌లోనూ పదేళ్లుగా ఈ ప్రకంపనలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పోలీసు, ఎక్సైజ్‌ అధికారుల హడావుడి తప్ప చర్యలు మచ్చుకైనా కనిపించవు. చిత్ర పరిశ్రమకు, డ్రగ్స్‌ మార్కెట్‌కు మధ్య సన్నిహిత సంబంధం ఉందని పోలీసులు చెబుతుంటారు. బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా ప్రతీచోటా ఇండస్ట్రీలో డ్రగ్స్‌ హవా నడుస్తోందని చెబుతున్నారు.

వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్‌ సబ్‌స్టాన్సస్:
ఈ మాదకద్రవ్యాల్లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. వృక్షాల నుంచి లభించే పదార్థాలతో తయారయ్యే నార్కోటిక్‌ సబ్‌స్టాన్సస్‌. ల్యాబ్స్ లో తయారు చేసే సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్‌. గాంజ (గంజాయి), ఓపియం (నల్లమందు), కొకైన్‌లతో పాటు గాంజ ద్వారా ఉత్పత్తి చేసే చెరస్, హషీష్‌ ఆయిల్, బంగ్, ఓపియం ద్వారా ఉత్పత్తి అయ్యే బ్రౌన్‌ షుగర్, హెరాయిన్‌ … ఇవన్నీ నార్కోటిక్స్‌ కిందకి వస్తాయి.

ల్యాబ్స్ లో తయారు చేసే సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్:
కెటామిన్, ఎపిడ్రిన్, పెథిడిన్‌ తదితరాలు సైకోట్రోపిక్స్‌ కోవకు చెందుతాయి. సినీరంగంలో నార్కోటిక్స్‌ వినియోగమే ఎక్కువ. వీటిలోనూ గాంజ, చెరస్, కొకైన్‌ను విచ్చలవిడిగా వాడుతున్నారు. గాంజ ఉత్పత్తులు ప్రధానంగా హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి సరఫరా అవుతున్నాయి. అక్కడ పండే గంజాయితో పాటు చెరస్, హషీష్‌ ఆయిల్‌కు సినీ రంగంలో మంచి డిమాండ్‌ ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇక ఓపియం సహా దాని ఉత్పత్తులైన బ్రౌన్‌ షుగర్, హెరాయిన్ల చలామణి తక్కువ.

నైజీరియన్లదే కీలకపాత్ర:
ముంబై, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చండీగడ్‌ల్లో డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్లు ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వీరి నెట్‌వర్క్‌లో నైజీరియన్లదే కీలకపాత్ర. నైజీరియా, ఉగాండా తదితర సౌత్‌ ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన వారిని ఆకర్షించడం ద్వారా వివిధ వీసాలపై భారత్‌ రప్పిస్తున్నారు. వారి పాస్‌పోర్ట్స్‌ డిపాజిట్‌ చేయించుకుని వివిధ నగరాల్లో రిటైల్‌ వ్యాపారం వీరికి అప్పగిస్తున్నారు. బస్సులు, రైళ్లల్లో డ్రగ్‌ను అక్కడకు చేరుస్తున్నారు.

విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని హోల్‌సేల్‌ పెడ్లర్స్‌కు పంపడం, వారిచ్చే కమీషన్‌ తీసుకోవడం వీరి పని. ఈ నైజీరియన్లు పట్టుబడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ గుర్తింపును హోల్‌సేలర్లు గోప్యంగా ఉంచుతున్నారు. సుశాంత్‌ సింగ్‌ కేసులు ‘అనుబంధంగా’ వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఓ నైజీరియన్‌ను కూడా అరెస్టు చేయడం గమనార్హం. సినీ రంగానికి చెందిన వారి నుంచి శని, ఆదివారాల్లో రాత్రి 9 నుంచి తెల్లవారుజాము 3 వరకు పెడ్లర్స్‌ మంచి బిజినెస్‌ చేస్తుంటారని అధికారులు చెప్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌పై వచ్చే ఆర్డర్స్‌ ఆధారంగా పరిచయస్తులకు మాత్రమే విక్రయిస్తుంటారు. నగరంలోని పబ్స్‌తో పాటు శివార్లలోని ఫామ్‌హౌస్‌లు, రిసార్టుల్లో జరిగే రేవ్‌ పార్టీలకు సప్లయ్ చేస్తుంటారు.

హెరాయిన్ ను ఇలా సేవిస్తారు:
బ్లాక్‌ ట్రా, చివా, నెగ్రా, హార్స్‌ మారుపేర్లు. ఇంజెక్షన్‌ చేసుకోవడం, ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకుని కాల్చడం ద్వారా దీన్ని సేవిస్తారు. హెరాయిన్‌ ను ఎక్కువగా వినియోగిస్తే శ్వాసకోస వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లి మరణించడం సైతం జరుగుతుంది.

గాంజ, చెరస్ ఇలా సేవిస్తారు:
ఓ మాల్‌గా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆకులను సిగరెట్‌లో నింపుకుని కాలుస్తారు. ఈ చెట్టు నుంచి కారే బంక నుంచి చెరస్‌ ఉత్పత్తి అవుతుంది. దీనిని నేరుగా తీసుకోవడం లేదా సిగరెట్‌ ద్వారా సేవిస్తారు. వీటి ప్రభావం ఊపిరితిత్తులు, మెదడు, నాడీ వ్యవస్థపై ఉంటుంది.

కొకైన్‌:
స్టఫ్, కోకి, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా మారుపేర్లు. ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకుని కాల్చడం, వైన్‌లో కలుపుకుని తాగడం ద్వారా సేవిస్తారు. దీని వినియోగం పెరిగితే కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో పాటు అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఉంది. గండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయి.

వెండితెరతో లింకులు ఎన్నో:
* బాలీవుడ్‌లో 1970ల్లోనే ఈ డ్రగ్స్‌ వాడకం వెలుగు చూసింది. అప్పటి నటీమణులు పర్వీన్‌ బాబీ, ప్రోతిమా బేడీ ఈ విషయాన్ని అంగీకరించారు కూడా.
* సంజయ్‌దత్‌ సైతం ఈ వ్యవహారంలో వివాదాస్పదుడయ్యాడు. ఫర్దీన్‌ ఖాన్‌ కొకైన్‌ను కలిగి ఉండి 2001లో ముంబై నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోకు చిక్కాడు.

* అక్కడ పట్టుబడిన డ్రగ్‌ డీలర్‌ కరీమ్‌షేక్‌ అనేక మంది స్టార్ల పేర్లు బయటపెట్టాడు. నటుడు విజయ్‌రాజ్‌ డ్రగ్స్‌ తరలిస్తూ అబుధాబి పోలీసులకు చిక్కాడు.
* ఈ డ్రగ్స్‌ వినియోగ, విక్రయ జాడ్యం ఇప్పుడు టాలీవుడ్‌నూ పట్టిపీడిస్తోంది. పటుత్వం కోసం, ముఖవర్చస్సు పెంపొందించుకోవడానికి, స్ట్రెస్‌ రిలీఫ్‌ పేరుతో వీటి వాడకం ఎక్కువ చేశారు.
* హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన ఉగాండా జాతీయులు ప్రాట్రిక్, ఐబేర్‌లు… టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన నైజీరియా జాతీయుడు ఒకాచోలు కొకైన్‌ స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరి కస్టమర్లలో 80 శాతం సినీ రంగానికి చెందిన వర్ధమాన తారలే.

* ప్రముఖ నటుడు రవితేజ సోదరులైన బి.రఘుబాబు, బి.భరత్‌రాజ్‌ను వెస్ట్‌జోన్‌ స్పెషల్‌ పార్టీ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో అనేక మంది సినీ తారల పేర్లు బయటకు వచ్చాయి.
* రెండేళ్ల క్రితం ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన ముఠా సైతం దాదాపు 60 మంది సినీ ప్రముఖులు తమ కస్టమర్లని బయటపెట్టారు. కొందరిని అధికారులు పిలిచి విచారించారు. అయితే ఈ రెండు కేసులూ చివరకు అటకెక్కాయి.

ట్రెండింగ్ వార్తలు