Cyber Fraud: బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..

ఆ మహిళ ఆ లింక్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.

Cyber Fraud: బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..

Updated On : December 8, 2025 / 12:48 AM IST

Cyber Fraud: సైబర్ నేరాల గురించి పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే ఉన్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అడ్డంగా బుక్కైపోతున్నారు. అమాయకత్వంతో డబ్బులు పొగొట్టుకుంటున్నారు. తాజాగా 24 రూపాయల రీఫండ్ కోసం ఓ మహిళ ఏకంగా 87వేల రూపాయలు పొగొట్టుకుంది.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె.. రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపారు. దాని ద్వారా బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

అహ్మదాబాద్‌లో ఒక మహిళ ఆన్ లైన్ లో వంకాయలు ఆర్డర్ చేసింది. అందుకోసం 24 రూపాయలు చెల్లించింది. ఏం జరిగిందో కానీ, తన డబ్బు రీఫండ్ అడిగింది. అదే ఆమె కొంప ముంచింది. 3 రోజుల క్రితం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో ద్వారా కొన్ని కూరగాయలు ఆర్డర్ చేసింది. అయితే, ఆమె అడిగిన వంకాయలకు బదులుగా పెద్ద వంకాయలు వచ్చాయి. దాంతో ఆమె వాటిని తిరిగి ఇవ్వడానికి డెలివరీ బాయ్‌ని సంప్రదించగా.. అతడు నిరాకరించాడు. కస్టమర్ కేర్ కి కాల్ చేయాలని సూచించాడు.

డెలివరీ బాయ్ దగ్గర కస్టమర్ కేర్ నంబర్ లేకపోవడంతో, ఆ మహిళ ఆన్‌లైన్‌లో చెక్ చేసింది. అక్కడ ఒక నెంబర్ కనిపించింది. దానికి ఆమె కాల్ చేసింది. అతడు ఆమెకు మరో నెంబర్ ఇచ్చి ఫిర్యాదు చేయడానికి కాల్ చేయమని అడిగాడు. అతడు చెప్పినట్లే ఆమె కాల్ చేసింది. అవసరమైన సమాచారం కోసం వాట్సాప్ కాల్ వస్తుందని ఆ మహిళతో చెప్పాడు. అన్నట్లే కాల్ వచ్చింది. అతడు ఏదో సమాచారం అడిగాడు. ఆమె ఆ సమాచారం ఇచ్చింది. తర్వాత వాట్సాప్‌లో కాల్ చేసిన వ్యక్తి ఆమెకు రీఫండ్ ప్రాసెస్ చేయబడిందని, త్వరలో జనరేట్ అవుతుందని హామీ ఇచ్చాడు. రీఫండ్ తనిఖీ చేయడానికి కాలర్ ఆమెకు లింక్‌ను కూడా పంపాడు.

బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని..

ఆ మహిళ ఆ లింక్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది. వివరాలు ఇచ్చిన తర్వాత, ఆ మహిళ తన UPI పాస్‌వర్డ్‌తో రీఫండ్ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ప్రయత్నించింది. రీఫండ్ జనరేట్ కాకపోవడంతో ఆమె మళ్ళీ అదే నంబర్‌కు కాల్ చేసింది. దాంతో అతడు.. ఇతర ఖాతాల బ్యాలెన్స్‌ను కూడా చెక్ చేయమని చెప్పాడు. వాళ్లు చెప్పినట్లు ఆమె తన ఇతర బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసింది. అంతే.. వేర్వేరు అకౌంట్ల నుంచి మొత్తం 87వేల రూపాయలు కట్ అయ్యాయి. దాంతో ఆమె లబోదిబోమంది. తాను మోసపోయాను అని తెలుసుకుని షాక్ కి గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కస్టమర్ కేర్ కావొచ్చు మరొకటి కావొచ్చు.. ఆన్ లైన్ లో ఫోన్ నెంబర్ల కోసం వెతకడం చాలా డేంజర్ అంటున్నారు పోలీసులు. ఏదైనా ఫోన్ నెంబర్ కావాలంటే.. వారి అధికారిక వెబ్ సైట్లకు వెళ్లి నెంబర్లు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఏ నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్ తీసుకుని కాల్ చేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.