భయపెడుతున్న బర్డ్ ఫ్లూ : కిలో చికెన్ రూ. 15!

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ : కిలో చికెన్ రూ. 15!

broiler cock becomes cheaper : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టనే లేదు. కొత్త కొత్త వైరస్ లు భయపెట్టిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ తాజాగా భయపెడుతోంది. వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు, బాతులు చనిపోతున్నాయి. చికెన్, కోడి గుడ్లు తినవద్దనే ప్రచారం జరుగుతుండడంతో పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. చికెన్ కానీ, గుడ్లు కాని తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నా, దాని పేరు ఎత్తితేనే భయపడే పరిస్థితిలో జనాలు ఉన్నారు. హర్యానా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

జింద్ జిల్లాలో ప్రతిరోజు కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతుంటాయి. లక్షల కోళ్లు వివిధ షాపులకు తరలిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే..జింద్ జిల్లా పౌల్ట్రీ హబ్ గా పేరొందింది. దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజు 4 లక్షల కోళ్లు విక్రయించేందుకు వెళుతుంటాయని అంచనా. బర్డ్ ఫ్లూ కారణంగా..సేల్స్ పడిపోవడంతో కోళ్ల వ్యాపారులకు ప్రతి రోజు సుమారు కోటి నుంచి 20 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారని తెలుస్తోంది. ఢిల్లీ మార్కెట్ లో బ్రాయిలర్ కోడి కిలో రూ. 15 పలుకుతుండడంతో చికెన్ దుకాణ దారులు గగ్గోలుపెడుతున్నారు.

భారతదేశంలో ప్రజలు మాంసపదార్థాలను ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. అందులో చికెన్ ఒకటి. దీనిని సుమారు 70 డిగ్రీల టెంపరేచర్ వద్ద ఉడకబెడుతారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫారాల్లో కోళ్ల మృతికి ఇతర కారణాలు ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తానికి బర్డ్ ఫ్లూ కారణంగా..పౌల్ట్రీ రంగం తీరని నష్టాలను చవి చూస్తోంది.