Online Bonam: లష్కర్ బోనాలు ఆన్‌లైన్‌లో సమర్పించండిలా

ఆషాడం వస్తూనే తెలంగాణకు బోనాల సందడిని మోసుకొస్తుంది. జులై మూడో వారంలో జరిగే లష్కర్ బోనాలతో హడావుడి మొదలైపోయినట్లే. తలపై బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు.

Online Bonam: లష్కర్ బోనాలు ఆన్‌లైన్‌లో సమర్పించండిలా

Online Bonam Plan From Lashkar Bonam Celebration

Online Bonam: ఆషాడం వస్తూనే తెలంగాణకు బోనాల సందడిని మోసుకొస్తుంది. జులై మూడో వారంలో జరిగే లష్కర్ బోనాలతో హడావుడి మొదలైపోయినట్లే. తలపై బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటికి చేరుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రత్యక్షంగా బోనం సమర్పించే పరిస్థితులు లేకుండా పోయాయి. ఆలయ నిర్వాహకులు భక్తుల శ్రేయస్సును ఆలోచించి సరికొత్త ఆలోచన చేశారు.

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అందులోని బియ్యాన్ని ప్రసాదంలా పోస్టు ద్వారా మన ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. తొలిసారిగా ఈ ఏడాది లష్కర్‌ బోనాలతో ఈ వినూత్న ప్రయోగానికి దేవాదాయ – తపాలాశాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టనున్నాయి.

భద్రాద్రి తలంబ్రాలతో మొదలు
కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఆలయాల్లోకి వెళ్లకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తేసినా కరోనా భయంతో చాలామంది ఆలయాలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆన్‌లైన్‌లో గోత్ర నామాలతో పాటు ఇతర వివరాలను ముందుగా నమోదు చేసుకుంటే.. వారి పేరిట పూజాదికాలు నిర్వహించి పోస్టు ద్వారా ముత్యాల తలంబ్రాలు, మిశ్రీ ప్రసాదాన్ని ఇంటికే పంపే ఏర్పాట్లు చేసింది.

బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌ గణేశ్‌ మందిరం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయస్వామి మందిరం, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ ఆలయం, కర్మన్‌ఘాట్‌ హనుమాన్‌ దేవాలయాల్లో కూడా ఆన్‌లైన్‌ పూజలతో పోస్టు ద్వారా ప్రసాదం అందించే వెసులుబాటు కల్పించారు.

రుసుము రూ.200!
బోనాలు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి రూ.200 రుసుము నిర్ధారించే వీలుంది. పోస్టాఫీసుల్లో చెల్లించి పేరు నమోదు చేసుకుంటే భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.