Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

ఒత్తిడి కారణంగా.. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. దీని కారణంగా గుండె కండరాలు బలహీనపడి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

Disease Attack

Disease Attack : ఆధునిక జీవితంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు మనుషులను వెంటాడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్నవయస్సు వారినే జబ్బులకు గురయ్యేలా చేస్తున్నాయి. ఈ పరిణామాలు ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తును దెబ్బతీసేవిగా పరిణమించాయి. జబ్బులను నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం యువతకు ఏర్పడింది. చిన్నవయస్సులోనే యువత జబ్బుల బారిన పడి మరణిస్తుండటం పట్ల నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్, గుండె జబ్బులు వంటివి వ్యాధులు యువతను చుట్టుముడుతున్నాయి. వీటితోపాటుగా మానసిక జబ్బులు యువతపై ముప్పేట దాడి చేస్తున్నాయి.

చదువులు, వృత్తి పరంగా ఎదురవుతున్న వత్తిడుల కారణంగా చాలా మంది అనేక మానసిక ఆందోళనలకు లోనవుతున్నారు. అవి క్రమేపి వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల్లో గతంతో పోలిస్తే యువతలో ఎక్కువ మంది ఒత్తిడికి లోనవుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడితో కూడిన జీవితం, వేళకు తిండి, నిద్ర లేకుండా గడపటం వంటి వాటివల్ల 35 ఏళ్లలోపు యువకులు హార్ట్‌ స్ట్రోక్‌ల బారినపడుతున్నారు. డయాబెటిక్‌ బాధితుల సంఖ్య పెరగడానికి ఇవేకారణంగా నిపుణులు చెబుతున్నారు.చాలా మంది ఖర్చులకు తగ్గట్టు ఆదాయం లేకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ పరిశీలనలో ఆశ్ఛర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. 2021 జనవరి నుంచి బోధనాస్పత్రుల్లో నమోదవుతున్న ఔట్‌ పేషెంట్‌ సేవల తీరును ఎప్పటికప్పుడు హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎంతమేరకు జీవనశైలి జబ్బులు నమోదవుతున్నాన్న విషయాన్ని విశ్లేషిస్తున్నారు. ఏపిలో గడచిన 5 నెలల్లోనే 1.30 లక్షల మందికి పైగా ఔట్‌ పేషెంట్లు జీవనశైలి జబ్బులతో చికిత్సకు వచ్చారని తేలింది. ఇవి కేవలం 11 బోధనాస్పత్రుల్లో నమోదైన కేసులు మాత్రమేనని లెక్కలు చెబుతున్నాయి. వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉంటాయన్న అంచనా వేస్తున్నారు.ఏప్రిల్‌ నుంచి ఆగస్ట్‌ వరకూ అత్యధికంగా 51 వేల మందికి పైగా బాధితులు మానసిక జబ్బుల కారణంగా ఔట్‌ పేషెంట్‌ సేవల కోసం ప్రభుత్వ పెద్దాస్పత్రులకు వచ్చినట్టు హెచ్‌ఎంఐఎస్‌లో నమోదైంది.

ఒత్తిడి కారణంగా.. అధిక రక్తపోటు, ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం లాంటి సమస్యలు ఏర్పడుతాయి. దీని కారణంగా గుండె కండరాలు బలహీనపడి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ధూమపానం చేసేవారికి కొరోనరీ ఆర్టరీ వ్యాధి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండె జబ్బులతో మరణించిన ప్రతి ఐదుగురిలో.. ఒకరు ధూమపానానికి సంబంధించిన వారే ఉన్నారు. ఎప్పుడో అర్థరాత్రి వేళ నిద్రపోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మంచి ఆరోగ్యం కోసం 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి. జంక్ ఫుడ్ తినడం వల్ల కేలరీలు, చెడు కొలెస్ట్రాల్ అమితంగా పెరుగుతాయి. ఇలా నిరంతరం తినడం వల్ల బరువు పెరగుతారు. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె జబ్బులు, మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ వంటి ప్రధాన జబ్బులు రాకుండా కాపాడుకోవడమనేది ఆ వ్యక్తుల చేతుల్లోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.