బలమైన యోధుడిని బోర్డర్ కు పంపారు…అసెంబ్లీలో సీటు మార్పుపై పైలట్

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్‌ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్‌ గహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అయింది.

అయితే, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో భేటీ అయిన మరుసటి రోజు సచిన్‌ పైలట్‌ శుక్రవారం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి గహ్లోత్‌కు దూరంగా విపక్షాలకు దగ్గరగా పైలట్‌కు సీటు కేటాయించడం చర్చనీయాంశమైంది.

తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్… తనదైన శైలిలో స్పందించారు. తనకు బోర్డర్‌లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని అన్నారు. బలమైన యోధుడు సరిహద్దుకు పంపబడ్డడని పైలట్ అన్నారు. సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు,‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో గహ్లోత్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష బీజేపీ ప్రకటించగా, పైలట్‌ రాకతో బలోపేతమవడంతో తామే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గహ్లాత్‌ శిబిరం యోచిస్తోంది.

కాగా, 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్‌ అసెంబ్లీలో మెజారిటీకి 101 మంది సభ్యులు అవసరం కాగా, కాంగ్రెస్‌ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇండిపెండెంట్లు, చిన్నపార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని ఆ పార్టీకి 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విపక్ష బీజేపీకి 72 మంది ఎమ్మెల్యేలున్నారు.

ట్రెండింగ్ వార్తలు