Makkan Singh Raj Thakur: మంత్రి పదవి రేసులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..! ఆ కోటాలో పదవి పక్కా అని ధీమా..!

రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలున్నప్పటికి... మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి.

Makkan Singh Raj Thakur: మంత్రి పదవి రేసులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..! ఆ కోటాలో పదవి పక్కా అని ధీమా..!

Updated On : December 10, 2025 / 11:13 PM IST

Makkan Singh Raj Thakur: ఉన్నది రెండు క్యాబినెట్ బెర్తులు. ఎంతోమంది ఆశావహులు. మరెన్నో క్యాస్ట్ ఈక్వేషన్స్. అయినా తన లెక్కలు తనకు ఉన్నాయంటున్నారు ఓ ఎమ్మెల్యే. ఎంబీసీ కోటాలో తనకు మినిస్ట్రీ పక్కా అని ధీమాగా ఉన్నారట. ఐయామ్ మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అంటూ.. ఓ రేంజ్‌లో హోప్స్ పెట్టుకుని హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయనకు అమాత్య యోగం అంత దగ్గరలో ఉందా?

రెండో సారి క్యాబినెట్ విస్తరణపై ఆ ఎమ్మెల్యే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎంబీసీ కోటా.. డిస్ట్రిక్ ఈక్వేషన్స్ ఎలా ఎన్నో లెక్కలు వేసుకున్నా.. అప్పట్లో జస్ట్ మిస్. అయినప్పటికి పట్టు వదలని విక్రమార్కుడిలా అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇంకా మంత్రి వర్గంలో రెండు బెర్తులు ఖాళీగా ఉండటంతో..ఎంబీసీ కోటాలో ఛాన్స్ కోసం పట్టుబడుతున్నారట. రెండో విడత మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోవాలనే ఆశతో సౌత్ టు నార్త్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఫలితం దక్కలేదట.

అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇరుగు పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు కానీ..మక్కాన్ సింగ్ కోరిక నెరవేర లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ ఒక్కరే ఉన్నారు. మొదటి నుంచి ఎంబీసీ కోటాలో తనకు బెర్త్ దక్కడం ఖాయమని భావించిన ఆయనకు.. జిల్లా ఈక్వేషన్స్ మాత్రం అడ్డంకిగా మారుతున్నాయట. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ఉండటంతో ఆయనకు ఛాన్స్ దక్క లేదు. అయితే నెక్ట్స్ విస్తరణలో మాత్రం జిల్లా నుండి ఓ మంత్రిని తప్పించైనా మక్కాన్ సింగ్ కు బెర్త్ ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది.

జగన్ తోనూ మంచి సంబంధాలు..

2014, 2018లో రెండుసార్లు రామగుండం నుంచి పోటీ చేసి ఓడిన మక్కాన్ సింగ్.. 2023 ఎన్నికల్లో మాత్రం గెలుపొందారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి హయంలో మక్కాన్ సింగ్ కు శాప్ ఛైర్మన్ పదవి దక్కింది. రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలున్నప్పటికి… మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా విజయం సాధించడం, పార్టీ అధికారంలో ఉండడంతో..ఎంబీసీ స్లోగన్ కలిసి వస్తుందనుకున్నారు. మొదట విడతలో బీసీ కోటలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు మంత్రి పదవులు దక్కగా..రెండో విడత క్యాబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరి మంత్రి అయ్యారు. ఎంబీసీ కోటాను పరిగణలోకి తీసుకుంటే…తనకు మినిస్టర్ పదవి దక్కుతుందనేది మక్కాన్ సింగ్ నమ్మకం.

క్యాబినెట్ లో మొత్తం 18మందికి అవకాశం ఉండగా..సీఎంతో కలిసి 16 మందితో క్యాబినెట్ కొనసాగుతుంది. మొదటి విడతలో 11 మందిని, రెండో విడతలో ముగ్గురికి క్యాబినెట్ లో బెర్త్ లు దక్కాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో మరో రెండు ఖాళీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మిగిలిన రెండింట్లో ఓ ఛాన్స్ ఇవ్వాలంటున్నారట మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పార్టీకి వీర విధేయుడిగా పని చేయడమే కాదు…సామాజిక పరంగా చూసుకున్నా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అంటున్నారట.

సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహతుడే కాదు..రాహుల్ గాంధీతో మంచి సంబంధాలున్నాయి. ఇక అమాత్య పదవి దక్కితే మాత్రం మొదటి మంత్రిగా రామగుండం పొలిటికల్ హిస్టరీలో మిగిలిపోనున్నారు. కాబట్టి… మక్కాన్ మంత్రి పదవి కోసం మాములుగా ట్రై చేయడం లేదట. అయితే అమాత్య రేసులో ఉన్న మక్కాన్ సింగ్ కు…రెండోసారి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడి పదవి దక్కింది. డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చినా తన సీనియారిటీకి తగ్గ పదవి ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట ఎమ్మెల్యే. మంత్రి పదవి ఎలాగో పెండింగ్ లో పడుతుంది.. కనీసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఇవ్వాలి కదా అంటూ తన సన్నిహితుల దగ్గర డిస్కస్ చేస్తున్నారట. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కల నెరవేరుతుందా.. ఆయన మంత్రి పదవి ఆశ తీరుతుందో చూడాలి.

Also Read: అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌యే టార్గెట్టా? చర్చనీయాంశంగా మారిన కవిత తీరు..