ఖగోళంలో మరో అద్భుతం : జనవరి 20న బ్లడ్ మూన్

  • Published By: veegamteam ,Published On : December 27, 2018 / 12:08 PM IST
ఖగోళంలో మరో అద్భుతం : జనవరి 20న బ్లడ్ మూన్

2019, జనవరి 20న ఖగోళంలో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడు ఎరుపు వర్ణంలో కనువిందు చేయనున్నాడు. దీన్ని బ్లడ్ మూన్‌గా, సూపర్‌ మూన్‌గా ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. అమెరికాలో బ్లడ్ మూన్ క్లియర్‌గా కనిపించనుంది. ఇది చాలా అద్భుతమైన దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మళ్లీ చూడాలంటే రెండేళ్లు ఆగాల్సిందే:
2019, జనవరి 20న అర్థరాత్రి సమయంలో గ్రహణం పట్టనుంది. అర్ధరాత్రి దాటాక సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. రాత్రి 12.43 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం దర్శనం ఇస్తుంది. ఆ తర్వాత పాక్షిక గ్రహణం కనిపిస్తుంది. 21వ తేదీ అర్థరాత్రి వరకు గ్రహణం కొనసాగుతుంది. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం చూడాలంటే 2021 మే 21వరకు ఆగాల్సిందేనని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఆసియా దేశాల ప్రజలకు ఈ గ్రహణం చూసే అవకాశం లేదు. భారత్, ఆస్ట్రేలియా, ఫసిఫిక్ ద్వీపాల ప్రజలు బ్లడ్ మూన్ చూడలేరని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ బ్లడ్ మూన్‌ను డైరెక్ట్‌గా చూసి ఎంజాయ్ చేయొచ్చని, ఎలాంటి అపోహలు, భయాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు.
బ్లడ్ మూన్:
ఖగోళ పరంగా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్య మీదకు వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తిగా చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంఫూర్ణ చంద్రగ్రహణమని, కొంత భాగమే కనిపిస్తే దాన్ని పాక్షిక చంద్రగ్రహణమని అంటారు. గ్రహణం సమయంలో చంద్రుడిపై పడే కిరణాలు భిన్న రంగుల్లో మారి ఎరుపు, నీలం రంగులో దర్శనమిస్తాయి. దీన్ని బ్లడ్ మూన్ అంటారు.