Backyard Poultry farming techniques in Telugu
Poultry Farming : పెద్దగా పెట్టుబడి ఖర్చు లేకుండా ఆదాయం.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం కావాలి. ఇదేంటి అనుకుంటున్నారా..? పెరటి కోళ్ల పెంపకంతో చేకూరే ప్రయోజనాలివి. ఆలోచన ఉండాలే కానీ అవకాశాలు అనేకం. ఎక్కడెక్కడికో వెళ్లి ఉపాధి పొందేకంటే.. సొంత ఇంటి వద్దే ఆదాయం రెట్టింపు చేసుకునే మార్గం ఈ పెరటికోళ్ళ పెంపకం. అయితే కోళ్ల పెంపకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చని తెలియజేస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ ప్రొఫెసర్ డా. దైదా కృష్ణ ప్రసాద్.
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాటు కోళ్ల పెంపకం వ్యవసాయానికి అనుసందంగా ఉండేది. రానురానూ ఇవి కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత రెండు దశాబ్దాలుగా ఈ పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా ఇప్పుడు పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్లు అంటే పెరట్లో పెంచుకునే సాధారణ కోళ్ల జాతులు.
నాటుకోళ్లు మనందరికీ ఇష్టమైన జాతే అయినా… వీటిలో మాంసోత్పత్తి, గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం తక్కువ వుండటంతో నాటుకోళ్లతో సంకర పరిచి అభివృద్ధి చేసిన అనేక సంకరజాతి కోళ్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. పూర్తిగా నాటుకోళ్లను పోలిన ఈ కోళ్లు అధిక గుడ్ల దిగుబడితోపాటు, కొన్ని జాతుల్లో మాంసోత్పత్తి అధికంగా వుంది. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి.. తక్కువ పెట్టుబడి.. కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. అయితే వీటి పెంపకంలో కొద్దిపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పివి నరసింహారావు వెటర్నరీ కాలేజ్ పౌల్ట్రీసైన్స్ డిపార్ట్ మెంట్, ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. దైదా కృష్ణ ప్రసాద్.
పెరటి కోళ్లలో చాలా రకాలు ఉన్నాయి. గుడ్ల ఉత్పత్తితో పాటు మాంసం ఉత్పత్తికి కూడా పెంచుతున్నారు. అయితే కోళ్ళ పెంపకం చేపట్టే వారు తొలిదశనుండే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రోగాలు కోళ్ళ అభివృద్ధికి ఆటంకంగా మారుతాయి. కాబట్టి వీటి నివారణకు ముందస్తు టీకాలు వేయించాలని సూచిస్తున్నారు ప్రొఫెసర్.
Read Also : Sustainable Agriculture : స్టార్టప్‌లతోనే సుస్థిర వ్యవసాయం