Coconut Cultivation practices
Coconut Cultivation : కొబ్బరి ఎక్కువగా పండించే రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ ఒకటి. రాష్ట్రంలో సుమారు 2 లక్షల 60 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. రైతులు ప్రతి చెట్టు నుండి ఏడాదికి 100 నుండి 200 కాయల దిగుబడి సాధిస్తున్నారు. అధిక దిగుబడికి దోహదపడే కీలక భూమికను పోషిస్తున్నాయి పోషకాలు. కొబ్బరిలో ఏడాదికి రెండుసార్లుగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. తొలకరిలో ఎరువులు వేసిన రైతులు, ప్రస్థుతం రెండవ దఫా ఎరువులు అందించాల్సి వుంటుంది. ఎరువుల యాజమాన్యం చేపట్టాల్సిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరిని దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో కొబ్బరి విస్తీర్ణం అధికంగా వుంది. ప్రస్థుతం సాగులో వున్న విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయగోదావరి జిల్లాల్లో, మిగిలిన విస్తీర్ణం ఉత్తర కోస్తా, కృష్ణ, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వుంది. కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ము ముందున్నా, దిగుబడి మరింత పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. శాస్త్రీయ విధానాలు, ఆధునిక సేద్య పద్ధతులతో పాటు, సకాలంలో పాటించే ఎరువుల యాజమన్యం దీనికి తోడ్పడుతుంది.
కొబ్బరితోటల్లో మొక్క వయసును బట్టి ఎరువులను అందించాలి. 1 నుండి 4 సంవత్సరాల వయసు చెట్లకు అర కిలో యూరియా , 1 కిలో సింగిల్‌సూపర్‌ఫాస్ఫేట్ , 1 కిలో మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్ , 20 కిలోల పశువుల ఎరువును వేయాలి. 5 సంవత్సరాల చెట్లకు 1 కిలో యూరియా , 2 కిలో సింగిల్‌సూపర్‌ఫాస్పేట్ , రెండున్నర కిలోల మ్యూరేట్‌ఆఫ్‌పొటాష్ , 25 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి వేయాలి. అయితే ఎరువులను వేసే పద్ధతిలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎరువులను సక్రమమైన పద్ధతిలో చెట్టు చుట్టూ పళ్ళెంలో వేసినప్పుడే, అవి నేలలోకి ఇంకి, వేర్లు గ్రహించడానికి వీలు పడుతుంది. ఎరువులను రెండు సమభాగాలుగా చేసుకుని, జూన్- జూలై ఒకసారి , సెప్టెంబర్- అక్టోబర్‌మాసాల్లో రెండవ దఫాగా అందించాలి.
చెట్టు కాండానికి 3 నుండి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్ట్టితో కప్పాలి. వెంటనే నీరు కట్టాలి. మొక్కలకు ఉప్పు వేయుటం, వేర్లను నరికి వేయటం వంటివి చాలా ప్రమాదం. శాస్త్రీయమైన పద్ధతుల్లో మాత్రమే పోషకాలు అందించాలి. దీనివల్ల చెట్లనుండి ఆశించిన దిగుబడులు పొందవచ్చు. సాధారణంగా రైతులు 8 x 8 మీటర్ల దూరంతో ఎకరానికి 60 మొక్కలు వచ్చే విధంగా నాటుతున్నారు. ప్రస్థుతం పదిసంవత్సరాల వయసుదాటిన ఒక్కో చెట్టుకు 1000 నుండి 1200 రూపాయల కౌలు లభిస్తోంది.
అంటే రైతు స్థాయిలో ఎటువంటి ఖర్చు లేకుండా ఎకరాకు 60 వేల నుండి 72 వేల ఆదాయం ఒక్క కొబ్బరి ద్వారానే వస్తోంది. అయితే కొబ్బరిలో కోకో, కూరగాయలు, అరటి, మిరియం వంటి వివిధ వాణిజ్య పంటలు సాగుచేసుకునే అవకాశం వుండటంతో కొబ్బరికంటే అంతరపంటలతో మెరుగైన ఆదాయం సాధించే అవకాశం ఏర్పడుతోంది. ఇది ఒక్క కొబ్బరిసాగు ద్వారా మాత్రమే, రైతుకు అందివచ్చిన అవకాశం. అంతర పంటల సాగు వల్ల, వీటి వ్యర్థాలు నేలలో కలిసి సేంద్రీయ కర్బనశాతం పెరగుతుంది. కలుపు బెడద తగ్గుతుంది. ఈ విధమైన సాగులో రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు