Crop Cultivation Techniques : 7 ఎకరాల్లో ఏడంచెల సాగు.. ఏడాది పొడవునా పంటల దిగుబడి

Crop Cultivation Techniques : అసలు పశువుల వ్యర్థాలు, జీవామృతాలు, కషాయాలేవీ వాడకుండా ఉద్యాన పంటలు కళకళలాడుతూ ఎలా పెరుగుతున్నాయో మనమూ... చూద్దామా.

Crop Cultivation Techniques

Crop Cultivation Techniques : ఏ రంగంలోనైనా రాణించాలంటే అధునాతన పద్ధతులు, వినూత్న ఆలోచనలే కీలకం. ఇది వ్యవసాయ రంగానికీ వర్తిస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దగా గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. వినూత్న ప్రయోగాలు చేస్తున్న రైతులు మాత్రం క్లిష్ట పరిస్థితుల్లోనూ తగిన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఈ క్రమంలో రూపుదిద్దుకున్నదే ఏడంతస్తుల పంటల సాగు నమూనా. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ రైతు.

Read Also : Rabi Sesame Cultivation : రబీ నువ్వుసాగులో మేలైన యాజమాన్యం

విత్తుబట్టి పంట అంటారు. మంచి దిగుబడి రావాలంటే… నాణ్యమైన విత్తనం ఒక్కటే సరిపోదు. ఆ పండించే భూమిలో శక్తి ఉండాలి. జీవ పదార్థం ఉండాలి. వానపాములు, సూక్ష్మజీవుల సంచారం ఉండాలి. నీటిని పీల్చుకునే తత్వం ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా సేంద్రియ కర్బనం మెండుగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న నేల బంగారంతో సమానం. ఆ భూమిలో ఏ పంటైనా పండుతుంది. ఏ చీడపీడనైనా తట్టుకుంటుంది. అయితే మన నేలల్లో ఇదే లోపించింది. నూటికి 99 శాతం పొలాల్లో సేంద్రియ కర్బనం కనీసం అర శాతం కూడా లేదు.

7అంచెల విధానంలో పంటల సాగు :
అందుకే రసాయన సాగు నుంచి సేంద్రియ సేద్యానికి వస్తున్న రైతులు… ఆదిలో కనీస దిగుబడులు రాక… తిరిగి రసాయనాల వాడకానికే మొగ్గుచూపుతున్నారు. కాగా నేలసుసంపన్నమైతే… సౌభాగ్య పంట పండుతుందనేందుకు ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, దాసుపాలెంకి చెందిన రామిరెడ్డి వ్యవసాయం క్షేత్రమే పెద్ద నిదర్శనం. సేంద్రియ కర్బనం నిండుగా ఉన్న వారి 7 ఎకరాల పచ్చని వనానికి ప్రత్యేకంగా ఎటువంటి పోషణ చేయడం లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. అసలు పశువుల వ్యర్థాలు, జీవామృతాలు, కషాయాలేవీ వాడకుండా ఉద్యాన పంటలు కళకళలాడుతూ ఎలా పెరుగుతున్నాయో మనమూ… చూద్దామా.

రైతు రామిరెడ్డి చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నారు. పూర్తిగా రసాయన మందులతోనే పండించే వారు. అయితే పెరిగిన పెట్టుబడుల.. తగ్గుతున్న దిగుబడులు.. వాటికి తోడు మార్కెట్ లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో.. 8 ఏళ్లనుండి పాలేకర్ విధానంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. 7 ఏకరాల్లో 7 అంచెల విధానంలో పండ్లతోటలను సాగుచేస్తున్నారు. మొదటి వరసలో మామిడి చెట్లు నాటారు. రెండో వరుసలో మునగ, మూడో వరసలో సీతాఫలం, నాలుగవ వరసలో బత్తాయి, జామ, దానిమ్మ, యాపిల్ బేర్ ఇలా 7 వరుసల్లో పండ్ల మొక్కలు నాటారు. అంటే ఏడంచెల ప్రకృతి వ్యవసాయ విధానంలో ఏడాది పొడవునా పంటలు ఉంటాయి.

ఈ పంటలకు పూర్తిగా సేంద్రి ఎరువులనే వాడుతున్నారు రైతు. చీడపీడ నివారణకు పలు రకాల కషాయాలను తయారు చేసి పిచికారి చేస్తున్నారు. పెట్టుబడి లేకపోవడం.. పంట తక్కువగా వచ్చిన .. నాణ్యమైన దిగుబడులు వస్తుండటంతో రైతు ఈ సాగు విధానం పట్ల సంతృప్తిగా ఉన్నారు.  ఏడంచెల విధానంలో పంటలు వేయడం వల్ల  రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. పండ్లతోటలు, ఇతర వృక్షాలను పెంచడం ద్వారా వర్షాలను ఆకర్షించే అవకాశం ఉంటుంది. తక్కువ నీటి వినియోగంతోనే ఎక్కువ పంటలు పండించవచ్చని నిరూపిస్తున్నారు రైతు రామిరెడ్డి.

Read Also : Paddy Cultivation : రబీ వరిసాగు యాజమాన్యం.. సమగ్ర ఎరువులు, సస్యరక్షణ చర్యలు

ట్రెండింగ్ వార్తలు