Green Gram Cultivation : వేసవి పెసర సాగులో మేలైన యాజమాన్యం…అందుబాటులో అధిక దిగుబడినిచ్చే రకాలు

వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలిదశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి, రంధ్రాలు చేయటం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి.

Green Gram Cultivation : స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి, రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోను సాగుకు అనుకూలంగా వుంటుంది. ఏకపంటగానే కాక, పలుపంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరు గాను, పలుపంటల సరళిలో పంటమార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవటంతో దీనిసాగు నీటిపారుదలకింద, వేసవిలో సైతం రైతుకు లాభదాయంకంగా మారింది.

తక్కువ పెట్టుబడితో, స్వల్పకాలంలో చేతికొచ్చేవి అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా వుంటాయి. ఖరీఫ్ లో ఆలస్యంగా వరిసాగు చేసిన ప్రాంతాల్లోను, ప్రత్తి పంట పూర్తయిన పొలాలు, రబీ వేరుశనగ పూర్తయిన ప్రాంతాల్లోను.. వేసవిపంటగా పెసరసాగు రైతుకు అనుకూలంగా వుంటుంది. ఇప్పటికే పెసరను విత్తిన ప్రాంతాల్లో పైరు వారం రోజుల నుండి 20 రోజుల దశ వరకు వుంది. అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచే అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!

సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి 15వరకు పెసర విత్తటానికి అనుకూలమైన సమయం. నీటివసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం.. కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి వుండాలి. వేసవి పెసర సాగుకు L.G.G -407, 450, 460, M.G.G-295, TM-96-2 రకాలు అనుకూలంగా వుంటాయి. ఇటీవల వరంగల్ వ్యవసాయ పరిశోధనాస్థానం నుంచి విడుదలైన WGG-2 పెసర రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. వీటితోపాటు పలు ప్రైవేటు రకాలను కూడా రైతులకు అందుబాటులో వున్నాయి. వాటి గుణగణాలను పరిశీలించి, రైతులు సాగుకు ఎంచుకోవాలి. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరిమాగాణుల్లో వేసవి పంటగా సాగుచేసినట్లయితే ఎకరాకు 12 నుంచి 14కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తనాన్ని విత్తనశుద్ధిచేసి, విత్తుకుంటే విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టటంతోపాటు, విత్తిన 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు.

ఏపంటలోనైనా నాటిన తొలిదశలో కలుపు ప్రధాన సమస్య. ముఖ్యంగా పెసర విత్తిన 24 గంటల లోపు నేల రకాన్ని బట్టి, ఎకరాకు పెండిమిథాలిన్ 1 నుంచి ఒకటింపావు లీటరు, 200 లీటర్ల నీటికి కలిపి, పొలంమంతా సమానంగా పిచికారీ చేసుకోవాలి. రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో, నేలలో తగినంత తేమ వుండేలా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉధృతి అధికంగా వుంటే, అవసరాన్ని బట్టి పైరు 20, 25 రోజుల దశలో ఒకసారి గొర్రుతో అంతరకృషి చేసుకున్నట్లయితే, కలుపు నివారణతోపాటు భూమి గుల్ల బారి, తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. పంటకు కాలసిన పోషకాలను ఇప్పటికే ఆఖరిదుక్కిలో వేసిన రైతాంగం.. సాగునీటి యాజమాన్యంలోను తప్పనిసరిగా మెలకువలు పాటించాలి. నాటిన నెలరోజుల వ్యవధిలో రెండు తడులను అందించినట్లయితే, పైరు పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. ముఖ్యంగా తేమకు సున్నితదశలైన 45, 50 రోజుల దశలో తప్పనిసరిగా ఒకనీటితడిని అందించాలి. దీనివల్ల పూత, పిందె ఎదుగుదల బాగుండి, దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.

READ ALSO : Pesara Crop : పెసర పంటలో తెగుళ్లు, నివారణ

వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలిదశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా వుంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి, రంధ్రాలు చేయటం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీ లీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రామల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసినట్లయితే, పంటను కాపాడవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా వుండే వేసవిలో, పెసర పైరుకు రసంపీల్చు పురుగులు ఉధృతి అధికంగా వుంటుంది. పైరు తొలిదశలో తామరపురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు 1.5 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా ట్రైజోఫాస్, లీటరు నీటికి కలిపి, ఆకుల భాగం తడిచేలా పిచికారి చేయాలి.

అపరాలసాగులో దిగుబడులను ప్రభావితం చేయగల మరొక చీడ పల్లాకు తెగులు. ఇది వైరస్ తెగులు. తెల్లదోమ వల్ల ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందే ఈ తెగులు నివారణకు, రైతులు సమగ్ర సస్యరక్షణా చర్యలు చేపట్టాలి. రసం పీల్చు పురుగుల నివారణకు, ముందుగానే తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను వెంటనే ఏరి నాశనం చేయాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీ లీటర్ల డైక్లోరోవాస్ లేదా 0.3 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పొలంమంతా సమానంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని యాజమాన్య, సస్యరక్షణ చర్యలను పాటించిన రైతాంగం… పంట మలిదశలోను కొన్ని మెలకువలు పాటించాలి. ముఖ్యంగా పంట పక్వదశను గుర్తించి, సరైన సమయంలో కోతలు చేయాలి. గింజల్లో తగినంత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టి, మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచిధర దక్కి, రైతుకు లాభదాయంగా వుంటుంది.

ట్రెండింగ్ వార్తలు