Kanakambaram : కనక వర్షం కురిపిస్తున్న కనకాంబరం సాగు

కనకాంబరం పూలకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండటంతో ఇటీవలికాలంలో రైతులు కనకాంబరం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఉష్ణమండలపు పంట కావటంతో వాతావరణంలో హెచ్చుతగ్గులను ఇది తట్టుకుంటుంది.

Kanakambaram : పూలలో ఎన్నో రకాలు ఉన్నా సాంప్రదాయ బద్దమైన వాటిలో కనకాంబరం పువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది. సువాసనలు వెదజల్లకున్నా, మగువుల శిగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే మార్కెట్లో కనకాంబరం పూలకు ఇతర పూలకంటే మంచి డిమాండ్ ఉంది. వీటి ధరకూడా అధికంగా ఉంటుంది. కిలో ధర 700 రూపాయల నుండి 1000 రూపాయల వరకు పలుకుతుంది. అందుకే చాలా మంది సన్న,చిన్నకారు రైతులు తమకున్న తక్కవ విస్తీర్ణం పొలంలో కనకాంబరం పూల సాగు చేపట్టి అధిక అదాయం పొందుతున్నారు.

కనకాంబరం సాగు చేపట్టిన రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే దాదాపు మూడు సంవత్సరాలపాటు పూలదిగుబడిని పొందవచ్చు. ఏడాదికి ఎకరానికి 1800కిలోల నుండి 2,500కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు. సస్యరక్షణ చర్యలు, మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొక్కలు నాటిని 3నెలల్లోనే పూత ప్రారంభమై ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుండి జనవరి వరకు అధిక దిగుబడి వస్తుంది.

నీటి ఎద్దడిని తట్టుకునే బహువార్షిక పూలజాతి మొక్క కావటంతో రైతులకు కనకాంబరం సాగు ఉపయోగకరమని చెప్పవచ్చు. మీటరు ఎత్తువరకు పెరుగుతుంది. 30 నుండి 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత మొక్క పెరుగుదలకు అనువుగా ఉంటుంది. దక్షిణ భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అలంకరణలో కనకాంబరం పూలను విరివిగా వినియోగిస్తారు. కొబ్బరి, పామాయిల్, జామ, దానెమ్మ, నారింజ వంటి తోటల్లో అంతర పంటగా కనకాంబరం సాగును చేపట్టి రైతులు అదనపు అదాయాన్ని పొందవచ్చు.

కనకాంబరం పూలకు మార్కెట్ లో మంచి ధర లభిస్తుండటంతో ఇటీవలికాలంలో రైతులు కనకాంబరం సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ఉష్ణమండలపు పంట కావటంతో వాతావరణంలో హెచ్చుతగ్గులను ఇది తట్టుకుంటుంది.కనకాంబరం పువ్వులలో నారింజ, గులాబి, ఎరుపు, పసుపు, నీలి, తెలుపు రంగుల రకాలను రైతులు సాగు చేస్తున్నారు. రసాయన , పురుగు మందులు లేకుండానే తక్కువ ఖర్చుతో సేంధ్రీయ విధానంలో కనకాంబరం సాగును చాలా మంది రైతులు చేపడుతున్నారు.

కోస్తా ఆంధ్ర జిల్లాలు కనకాంబరం సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక తేమ, వేడికలిగిన వాతావరణం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడి నేలలు ఈ పంటసాగుకు అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిల్వని అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరం మొగ్గలు పువ్వులుగా విచ్చుకునేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. పువ్వులను రోజు ఉదయం, సాయంత్రం వేళ్ళల్లో కోయాల్సి ఉంటుంది. ఒక మొక్కకు అన్ని పువ్వులు విచ్చుకోవటానికి వెన్ను పొడవును బట్టీ 15 నుండి 25 రోజుల సమయం తీసుకుంటుంది. ఒక కిలోకు 15000 వేల వరకు కనకాంబరం పువ్వులు తూగుతాయి.

సొంత భూమి ఉన్న రైతులు సంవత్సరం పొడవునా అదాయం పొందాలంటే కనకాంబరం సాగు చేపట్టటం చాలా అనుకూలకమనే చెప్పొచ్చు. పశువుల ఎరువులతోనే కనకాంబరం సాగును చేపట్టవచ్చు. తద్వారా ఖర్చు తగ్గి మంచి అదాయం సమకూరే అవకాశం ఉంటుంది. నులిపురుగుల బెడద, ఎండు తెగులు సమస్య కనకాంబరం సాగులో అధికంగా ఉంటుంది. సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు