Huge Profits With Intercropping In Oil Palm
Oil Palm : పామాయిల్.. నాటిన మూడెళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు. అందుకే చాలా మంది రైతులు మొదటి రెండు మూడు ఏళ్లు.. తోటల్లో ఉన్న ఖాలీ స్థలాన్ని ఉపయోగించుకొని అంతర పంటలు సాగుచేస్తుంటారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు పామాయిల్ లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగుచేస్తూ.. పెట్టుబడులను తగ్గించుకోవడమే కాకుండా.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
తరచూ వచ్చే తుపాన్లు, భారీ వర్షాలు సాగుచేస్తున్న పంటలకు భారీ నష్టం తెచ్చిపెడుతున్నాయి. ఇలా కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలకు రైతు నష్టపోతూనే ఉన్నాడు. దీనికితోడు పెట్టుబడులు భారం. ఆపై ధాన్యం అమ్ముకోవడానికి నానాపాట్లు పడాల్సి వస్తోంది.
దీంతో ఈ నష్టాల బాధ పడలేక రైతులు పామాయిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ మొక్కలు నాటిన 3 ఏళ్ల తరువాతే దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాన పంట మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. అన్ని ఖర్చులు పోను రూ. 10వేల నుంచి రూ. 50వేల మధ్య ఆదాయం ఆర్జిస్తున్నారు.
తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. దీన్నే ఆచరిస్తున్నారు కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు మురళి కృష్ణ.
తనకున్న 2 ఎకరాల్లో రెండేళ్ల క్రితం పామాయిల్ మొక్కలు నాటారు. అయితే అంతరపంటలుగా కూరగాయలు సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరంలో బెండ.. మరో ఎకరంలో తీపిమొక్కజొన్నను నాటారు. ప్రస్తుతం బెండ దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Read Also : Vari Narumadi : వరి నారుమళ్లలో ఎదుగుదల లోపం.. మంచు నుంచి నారు సంరక్షణకు చర్యలేంటి?