Kalanamak Rice Variety
Kalanamak Rice Variety : ఆయనో ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు… విత్తన సంరక్షకుడు. భవిష్యత్‌తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం లభించాలంటే, దేశీ విత్తనాలతోనే సాధ్యం అని నమ్మారు. అందుకోసం అరుదైన దేశీ వరి విత్తనాలను 10 ఏళ్ళుగా సాగుచేస్తూ.. ప్రకృతి సేద్యమే లాభదాయకం అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ బుద్ధని కాలంలో సాగులో ఉన్న కాలానమక్ వరి రకాన్ని సాగుచేస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సిద్ధిపేట జిల్లాకు చెందిన రైతు జక్కుల తిరుపతి ద్వారా దేశీ వరి రకాల ప్రాముఖ్యత.. , వాటి సాగు విధానం.. లాభాల గురించి మనమూ తెలుసుకుందామా…
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో దేశీ వరి రకాల సాగు విస్తరిస్తోంది. ఈ కోవలోనే సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, నాగపురి గ్రామానికి చెందిన రైతు జక్కుల తిరుపతి 10 ఏళ్ళుగా సేంద్రియ విధానంలో అరుదైన దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం చూడండీ.. మొత్తం 5 ఎకరాలు. 3 ఎకరాల్లో కృష్ణ వ్రిహీ, మైసూర్ మల్లికా దేశీ వరి రకాలను సాగుచేస్తుండగా.. అర ఎకరంలో బహువార్షిక కంది రకం రిచా 2000 సాగుచేస్తున్నారు. మరో ఎకరం 10 గుంటల్లో ప్రయోగాత్మకంగా కాలానమక్ దేశీరకం వరిని సాగుచేస్తున్నారు రైతు తిరుపతి. 3 వేల సంవత్సరాల క్రితం సాగులో ఉన్న ఈ రకాన్ని గౌతమ బుద్ధుడు వెలుగులోకి తీసుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి.
అందుకే ఈ రకం బియ్యాన్ని బుద్ధబియ్యం అని కూడా పిలుస్తారు. ఈ రకం ధాన్యం నల్లగా ఉంటాయి… బియ్య మాత్రం తెల్లగా ఉండి.. వండేటప్పుడు సువాసన వస్తుంది. పంట కాలం 130 నుండి 140 రోజులు. ఎత్తు 3 నుండి 4 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో అధిక ప్రోటీన్లు ఉండటమే కాకుండా ఐరన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను కలిగివుండి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుండటంతో కాలానమక్ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేటర్ ట్యాగ్ కూడా లభించింది.
సేంద్రీయ సాగు: కాలా నమక్ వరి సాగును రైతు సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. సాధారణంగా దేశీ వరి రకాలు తుఫాన్లు, గాలివానలకు చేనుపై పడిపోతుంటాయి. కానీ ఈ రకం పడిపోలేదు. ఇటు ఎరువులు, పురుగుమందుల వాడకంలేకపోవడంతో పెట్టుబడి ఖర్చు కూడా తగ్గింది. అది రైతుకు ఆర్థికంగా మారుతుంది.
ఎకరంలో ప్రయోగాత్మకంగా కాలనమక్ వరి సాగు ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది. ఒక్కో గొలుసుకు దాదాపు 200 నుండి 300 గింజలు ఉన్నాయి. ఈ వరి సాగుకు ఎలాంటి ఎరువులు వేయలేదు. కాబట్టి తక్కువ పెట్టుబడి అయ్యింది. దిగుబడి 13 నుండి 15 క్వింటాళ్ళ వరకు వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఔషదాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్, గుండెసంబంధిత వ్యాధులు, డయాబెటిక్, కొలస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. దీనిని గమనించి, చుట్టు ప్రక్కల గ్రామాల రైతులు సైతం ఈ వరి రకాలను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు