Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకున్న వరినాట్లు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

Paddy Cultivation : తొలకరి ఆరంభంలోనే నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నాట్లు వేయటానికి ముందుగానే ప్రధాన పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేసుకోవాలి.

Kharif Season Paddy Cultivation

తొలకరిలో పడిన వర్షాలకు బోర్లు, బావుల క్రింద, ముందుగా వరి నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నాట్లను వేస్తున్నారు. కాలువలు, చెరువుల కింద వరిసాగుచేసే రైతులు ఇప్పుడిపపుడే నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి సదుపాయం తక్కువగా వున్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలవైపు మొగ్గుచూతున్నారు.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

వీటిలో డ్రమ్ సీడర్ తో నేరుగా దమ్ములో విత్తే  విధానం, యంత్రాలతో నాట్లు వేయటం వంటి సాగు విధానాలు  రైతుల క్షేత్రాలలో సత్ఫలితాలనిస్తున్నాయి. నాట్లు ఏ పద్ధతిలో వేసినా, మనం చేపట్టే సాగు విధానాలు, పోషక యాజమాన్యం పైనే దిగుబడులు ఆధారపడి వుంటాయి. మరిన్ని వివరాలు  కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ద్వారా తెలుసుకుందాం.

తొలకరి ఆరంభంలోనే నారుమళ్ళు పోసుకున్న రైతాంగం, నారు వయసు 30 రోజులు దాటకముందే నాట్లు వేయటం మంచిది. నాట్లు వేయటానికి ముందుగానే ప్రధాన పొలాన్ని రెండు మూడు దఫాలుగా మురగ దమ్ముచేసుకోవాలి. ఎత్తు పల్లాలు లేకుండా పొలమంతా సమానంగా వుండేటట్లు, పవర్ టిల్లర్ లేదా రోటోవేటర్ ఉపయోగించి దమ్ముచేసినట్లయితే మంచి ఫలితం వుంటుంది. నాటడానికి నాలుగు నుంచి ఆరు ఆకులు కలిగిన ఆరోగ్యవంతమైన నారును ఉపయోగించాలి.

నాటేముందు 70 నుంచి 80 లీటర్ల నీటికి 2కిలోల అజోస్పైరిల్లమ్ జీవన ఎరువు కలిపిన ద్రావణంలో నారు వేర్లను 10 నిమిషాలపాటు ముంచి నాటుకుంటే నత్రజని సహజసిద్ధంగా మొక్కలకు అంది మొనలు త్వరగా నిలదొక్కుకుంటాయి. యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

ప్రధాన పొలంలో నీరు పలుచగా పెట్టి, వరుసల్లో క్రమ పద్ధతిగా పైపైన నాటుకుంటే మంచిది. నాటేటపుడు ప్రతి చదరపు మీటరుకు 33 మొనలు వుండే విధంగా నాటుకోవాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు తప్పనిసరిగా కాలిబాటలు వదులుకున్నట్లయితే పైరుకు గాలి, వెలుతురు బాగా సోకి చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపుచేయవచ్చు.

చూశారుగా.. వరిసాగులో ప్రతికూల పరిస్థితులను అధిగమించే సాగు పద్ధతులను. అందివస్తున్న నూతన సాగు విధానాలను ఆచరిస్తూ,  సిఫారసు మేరకు సమగ్ర పోషకయాజమాన్యాన్ని ఆచరిస్తే.. సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవటమే కాదు సంప్రదాయ వరిసాగు కన్నా అధిక దిగుబడులు పొందవచ్చు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు