KPT Gold Paddy Seeds
Gold Paddy Seeds : నూతన వరి వంగడం కె.పి.టి రెడ్ గోల్డ్ రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు రూపొందించిన ఈ రకంలో గింజ నాణ్యత, కంకిపొడవు, దుబ్బుచేత అద్భుతంగా ఉన్నాయని సాగుచేసిన రైతులు తెలియజేస్తున్నారు . కె.పి.టి రెడ్ గోల్డ్ వరి రకం సాగులో రంగారెడ్డి జిల్లా రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వరి పైరును చూడండీ… నిండు గింజలతో మరి కొద్ది రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న ఈ నూతన వరి రకం కె.పి.టి రెడ్ గోల్డ్. దీన్ని సాగుచేస్తున్న రైతు రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం మండలం, పెద్ద ఎల్కిచర్ల గ్రామానికి చెందిన రైతు రామకృష్ణా రెడ్డి . ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నూతన వరి రకమైన కేపిటీ రెడ్ గోల్డ్ ను ఎంచుకొని తనకున్న 5 ఎకరాల్లో జులై చివరి వారంలో నాటారు. సాధారణ రకాలతో పోల్చితే తక్కువ పంటకు తక్కువ పెట్టుబడే అవుతుంది. అయితే ఈ రకాన్ని నాటెటప్పుడు కుదురుకు రెండు మొక్కలు మాత్రమే ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే ఈ రకం అధిక దుబ్బు చేస్తుంది. మొక్క 90 నుండి 100 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అధిక దుబ్బు ఉండటం వలన గాలివానలకు పడిపోదు . ఒక్క గొలుసుకు 400 నుండి 500 గింజలు ఉంటాయి. వెయ్యి గింజల బరువు 16 నుండి 17 గ్రాములు ఉంటుంది. ఇది సూపర్ ఫైన్ క్వాలిటి.. అన్నానికి అత్యంత అనుకూలం. రబీ పంటగా వేసినప్పుడు నీటి ఎద్దడిని సైతం తట్టుకుంటుంది. నూకశాతం చాలా తక్కువ. నవంబర్ మొదటి వారంలో కోతకోయనున్న ఈ పంట ఎకరాకు 50 బస్తాల దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అతి తక్కువ పెట్టుబడిలతో మంచి దిగుబడులను తీస్తున్నా రైతు రామకృష్ణారెడ్డి సాగు విధానాన్ని చూసి చుట్టుప్రక్కల రైతులు సైతం అనుసరిస్తున్నారు. ఈ రైతు వేసే నూతన వంగడాలనే తోటి రైతులు సాగుచేస్తూ.. మంచి లాభాలను పొందుతున్నారు.
Read Also : Kandi Cultivation : ప్రస్తుతం కందిలో చేపట్టాల్సిన సస్యరక్షణ