Summer Migration : వేసవిలో మేతకోసం జీవాల వలస!.. పోషణలో జాగ్రత్తలు తప్పనిసరి

జీవాలను వలస తీసుకువెళ్ళే ముందుగా అన్నింటికి పేడ పరీక్ష చేయించి నట్ల మందు తాగించాలి. చిటుక రోగం, గాలి కుంటు వ్యాదుల నివారణకు ముందుగానే టీకాలు వేయించుకోవాలి.

Summer Migration : వేసవి కాలంలో జీవాలకు మేత కొరత అధికంగా ఉంటుంది. పచ్చిక సరిగా అందుబాటులో దొరకకపోవటంతో జీవాల కాపరులు వాటిని పచ్చిక అందుబాటులో ఉన్న వివిధ ప్రాంతాలకు తోలుకు పోతుంటారు. ఇలా వలస వెళ్ళే సందర్భంలో ఎండ వేడిలోనే మందలతో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఇలా మందలతో వలస వెళ్ళే కాపరులు జీవాల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు.

జీవాలకు సరైన మేత లభించకపోవటం వల్ల వేసవిలో వాటి ఆహారంలో మాంసకృత్తుల లోపం ఏర్పడుతుంది. దీని వల్ల జీవాల మాంసోత్పత్తి సైతం తగ్గిపోతుంది. బరును కోల్పాతాయి. జీవాల్లో శక్తి లోపం వల్ల పునరుత్పత్తి క్షీణిస్తుంది. జీవాల్లో ఖనిజ లవణాల లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పొటేళ్లలో మరణాల శాతం అధికంగా ఉంటుంది. బీళ్లలో లభించే గడ్డి ద్వారా తక్కువ శక్తి అందుతుంది. దీంతో వాటిలో ఎదుగుదల తక్కువగా ఉండి బరువు త్వరగా కోల్పోతాయి.

జీవాలను వలస తీసుకువెళ్ళే ముందుగా అన్నింటికి పేడ పరీక్ష చేయించి నట్ల మందు తాగించాలి. చిటుక రోగం, గాలి కుంటు వ్యాదుల నివారణకు ముందుగానే టీకాలు వేయించుకోవాలి. అంతేకాకుండా కాపరులు తమ వెంట టింక్చర్, అయోడిన్, పొటాషియం, పర్మాంగనేట్, యాంటీ బయాటిక్ మాత్రలు, జ్వరం, నొప్పి తగ్గటానికి మాత్రలు, హిమాలయన్ బత్తీసా, నెబ్లాన్, సిరంజి వంటి ప్రధమ చికిత్సా సామాగ్రిని ఉంచుకోవాలి. వలకు ముందే మేత ఎక్కువ గా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆతరువాతనే జీవాలను అక్కడికి తీసుకువెళ్ళాలి.

జీవాలను ఎక్కువ సమయం ఎండలో ఉంచకుండా చెట్ల నీడలో ఉండేలా చూసుకోవాలి. రాత్రి వేళ్ళల్లో జంతువుల దాడి నుండి కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పారే నీరు ఉన్న ప్రాంతాలలలోనే జీవాలకు తాగునీటిని తాగించాలి. సూడి జీవాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. వలస సమయంలో కాపరులు తగిన జాగ్రత్తలు పాటిస్తే నష్టం కలగకుండా చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు