Mirchi Price Reduced
Mirchi Prices : మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి.. మార్కెట్ లో ధరలు తగ్గడంతో అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దిగుబడి ఉన్నా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని మిర్చి రైతులు కోరుతున్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు గణనీయంగా పెరిగింది.. దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతుంది. అయితే తిరుపతి జిల్లా, గూడూరు డివిజన్లో నిమ్మపంట తర్వాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు ఇక్కడి రైతులు దాదాపు 100 హెక్టార్లలో సాగవుతుంది.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రైతు పేరు శ్రీనివాసులు. తిరుపతి జిల్లా, గూడూరు మండలం, చెమిర్తి గ్రామానికి చెందిన ఈయన తనకు ఉన్న నాలుగు ఎకరాల భూమిలో మిరప సాగును చేపట్టారు. ఎకరా మిరప సాగుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది సరైన మద్దతు ధర లేకపోవడంతో.. నష్టాలను ఎదుర్కొంటున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్ లో ఎండుమిర్చికి అధిక ధర పలకడంతో మంచి లాభాలను ఆర్జించామంటున్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో వ్యాపారులు దగా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇలాగే పునరావృతం అయితే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుందని.. ప్రభుత్వం స్పందించి మిర్చి పంటకు సరైన మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు