Organic Fertilizers Preparation
Organic Fertilizers : సేంద్రియ సాగుకు ప్రాధాన్యం పెరిగినా.. సాగులో వినియోగించే ఎరువులు, కషాయాల తయారీ రైతులకు కష్టతరంగా మారింది. దీనిని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ లోని రైతు సాధికార సంస్థ రైతులకు సేంద్రియ సాగు.. కషాయాల తయారీ పట్ల శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాదు తయారుచేసిన కషాయాలను రైతులకు అందిస్తున్నారు..
వ్యవసాయంలో ఖర్చులు తగ్గించడంతో పాటు నాణ్యమైన, క్రిమి సంహారక రహిత దిగుబడులు సాధించాలనే ధ్యేయంతో అందుబాటులోకి వచ్చిందే ప్రకృతి వ్యవసాయం. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వినియోగం వల్ల భూమి నిస్సారంగా మారుతోంది. దిగుబడులు తగ్గిపోతున్నాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు గాను మహిళా రైతు సాధికార గ్రూపులను ఏర్పాటు చేశారు.
ఈ గ్రూపులు ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకొని, ప్రక్రతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, వివిధ రకాల ఎరువుల కషాయాలను తయారు చేయిస్తున్నారు. ఆ యా పంట సీజన్లో ఏ యే కషాయాలను పిచికారి చేయాలి, ఎంత మోతాదులో చేయాలని, కషాయాల తయారీకి ఎలాంటి పద్దతులను ఉపయోగించాలి వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం, కనిమెరక గ్రామంలో పలుపత్ర కషాయాన్ని తయారు చేసి, వరి పంటకు పిచికారి చేయించారు.
ప్రస్తుతం జిల్లాలో వరి పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అయితే, ప్రతీ ఏడాది యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులను ఉపయోగిస్తూ వచ్చారు. వీటి ఉపయోగం కష్టంతో కూడిన పని కావడం.. అధిక దిగుబడులపై అంతగా ప్రభావం చూపకపోవడంతో క్రమంగా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు. రైతు సాధికారిక సంస్థ ప్రతినిధుల సహకారంతో ఇటువంటి ప్రక్రతి వ్యవసాయ పద్దతులను అవలంభిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు