Paddy Cultivation
Paddy Cultivation : రబీలో వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలంటూ, తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో వరిసాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. అక్కడక్కడ నీటి వనరులు ఉన్నచోట, తప్పని పరిస్థితుల్లో కొందరు వరిసాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కూలీల కొరత అధికంగా ఉండటంతో, చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో, నేరుగా వెదజల్లే పద్ధతితో సాగుచేస్తున్నారు.
అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి కొన్ని మెళకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు.
వాయిస్ ఓవర్ : ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుండి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ. 2500 నుండి 3 వేల వరకు తగ్గుతుంది.
అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది.
అందువలనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతుంది. వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలలో, సమస్యాత్మక నేలల్లో అంటే చౌడు, క్షారము, ఆమ్లము ఉండే నేలలు అనుకూలం కాదు.
Read Also : Cow Dung : ఆవు పేడతో బిజినెస్ చేస్తున్న మహిళ.. 10 మందికి ఉపాధినిస్తూ.. అమెరికాకి కూడా..
వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యం తో పాటు ఎరువుల యాజమాన్యం కూగా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి.