Pest Control Black Gram : మినుములో తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Pest Control Black Gram : ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా.. కొంతమంది రైతులు అక్కడక్కడా పెసరను వేసారు. నవంబరు 15 నుంచి డిసెంబరు నెలలోపు విత్తిన పైర్లలో, వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా పెరుగుదల లేదు.

Pest Control Methods in Black Gram

Pest Control Methods in Black Gram : ఖరీఫ్ వరి తర్వాత మాగాణుల్లోని తేమను ఉపయోగించుకుని, మన రైతులు మినుము, పెసర పంటలను సాగు చేయటం ఆనవాయితి. మార్కెట్ రేట్లను దృష్టిలో వుంచుకుని చాలామంది రైతులు ఈ ఏడాది మినుము సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్థుతం పైరు 30 నుంచి 45రోజుల వయసులో వుంది. ఈ దశలో వివిధ రకాల చీడపీడలు పంటను ఆశించి నష్టపరుస్తాయి.వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను ఇప్పుడు చూద్దాం..

Read Also : Pests in Chilli Cultivation : మిరప తోటల్లో పురుగులు, తెగుళ్ల ఉధృతి.. చీడపీడల నివారణ

రబీకాలంలో మినుమును , పెసరను వరి మాగాణుల్లో  పండించడం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత. దాదాపు 6 లక్షల హెక్టార్లలో మాగాణుల్లో మినుము, పెసర సాగవుతుంటుంది. అంతే కాదు ఈ ఏడాది తెలంగాణలో కూడా చాలా చోట్ల వరిమాగాణుల్లో పెసర , మినుమును సాగుచేశారు రైతులు. వరి కోయడానికి 2 -3 రోజుల ముందుగా మినుము, పెసర విత్తనాన్ని వెదజల్లుతారు. ఈ ఏడాది మినుము పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వగా.. కొంతమంది రైతులు అక్కడక్కడా పెసరను వేసారు. నవంబరు 15 నుంచి డిసెంబరు నెలలోపు విత్తిన పైర్లలో, వాతావరణ ఒడిదుడుకుల వల్ల అంతగా పెరుగుదల లేదు.  డిసెంబరు 7వ తేదీ తర్వాత విత్తిన పైర్లలో పెరుగుదల ఆశాజనకంగా వుంది. ప్రస్థుతం మినుము పంట 30 నుంచి 45రోజుల వయసుతో పూత  దశకు చేరుకుంది. వరి తర్వాత భూమిలోని తేమను ఉపయోగించుకుని అపరాల పంటలు పెరుగుతాయి. నేలలో ఇవక ఎక్కువ వుంటే పైరు పెరుగదల నెమ్మదిగా వుంటుంది.. తేమ ఆరే కొద్దీ మొక్కలు వేగంగా పెరుగుతాయి.

ప్రస్తుతం పంటలో పురుగుల బెడద పెద్దగా లేకపోయినప్పటికీ.. అక్కడక్కడా బూడిద తెగులు, వైరస్ వల్ల సోకే పల్లాకు, సీతాఫలం తెగులు, ఆకుమచ్చ, తుప్పుతెగులు  ఇలా అన్ని రకాల తెగుళ్లు పంటలో కనిపిస్తున్నాయి. బూడిద తెగులు ప్రభావాన్ని గమనిస్తే.. ఇది విత్తిన 30 నుంచి 35రోజుల తర్వాత పంటపై కనిపిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా వుండటం, తీవ్ర మంచు ప్రభావం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం. ముందుగా, ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్నచిన్న మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దవై ఆకంతా వ్యాపిస్తుంది. తెగులు ఉదృతమైనప్పుడు మొక్కంతా వ్యాపించటం వల్ల ఆకులు పండుబారి రాలిపోతాయి. మొక్క క్షీణించి చనిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రాము కార్బెండిజమ్ లేదా 1 గ్రాము థయోఫానేట్ మిథైల్ పిచికారి చేయాలి. మైక్లోబూటానిల్ 0.5 గ్రాములు లేదా డైఫెన్ కొనాజోల్ 1.0 మిల్లి లీటర్లు కలిపి 10  నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

తుప్పు తెగులు నివారణ :
అక్కడక్కడ కనిపిస్తున్న మరోతెగులు తుప్పు తెగులు. ఆకు ఉపరితలంపైన లేత పసుపు వర్ణంలో గుండ్రని మచ్చలు ఏర్పడి క్రమేపి నల్లగా మారతాయి. ఇవి ఆకంతా వ్యాపించటం వల్ల ఆకులు ఎండి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజెబ్, 1 మిల్లీ లీటరు డైనోకాప్  లేదా 1 మిల్లీ లీటరు ట్రైడిమార్ఫ్ లేక 1 గ్రాము బైలాటాన్ కలిపి పిచికారి చేయాలి.

మినుము పెసర పంటలను తీవ్రంగా దెబ్బతీస్తున్న తెగులు పల్లాకు. జెమీనీ వైరస్ వల్ల సోకే ఈ తెగులును ఎల్లోవీన్ మొజాయిక్ అని పిలుస్తారు. ఈ వైరస్ తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. మొక్క తొలి దశలో ఈ వైరస్ ఆశిస్తే.. గిడసబారిపోయి, పూత పూయకముందే ఎండిపోతుంది. వైరస్ కు నివారణ లేదు. కనుక తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి. వైరస్ ను వ్యాప్తిచేసే తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2మిల్లీ లీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ట్రైజోఫాస్ 1.25మిల్లీలీటర్లు లీటరు నీటికి చొప్పున కలిపి వారం 10రోజుల వ్యవధితో రెండు సార్లు పిచికారిచేయాలి.

పేనుబంక ద్వారా వ్యాప్తి చెందే మరో వైరస్ తెగులును సీతాఫలం తెగులు అని పిలుస్తారు. తెలుగులుసోకిన మొక్కల ఆకులు మందంగా పెద్దవిగా పెరుగి పూత పూయవు. తెల్లదోమకు పిచికారిచేసిన మందులతోనే దీన్ని కూడా అరికట్టవచ్చు. పైరు విత్తేటప్పుడు కిలో విత్తనానికి 5మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా థయోమిధాక్సిమ్ 5గ్రాములు కలిపి విత్తనశుద్ధిచేస్తే, పైరు తొలిదశలో తెల్లదోమ ఆశించకుండా వుంటుంది. తద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. సాధారణంగా వరి మాగాణుల్లో సాగుచేసే పెసర మినుము పైర్లలో 35 నుంచి 40రోజుల దశలో ఆకుమచ్చ తెగుళ్లు, 35 నుంచి 50రోజుల దశలో బూడిద తెగులు, 60 నుంచి 65 రోజుల దశలో ఆశించే బూడిద తెగుళ్లు ముఖ్యమైనవి. తెగులు సోకిన తర్వాత మందులు పిచికారిచేసేకంటే ముందు జాగ్రత్తగా మందులు పిచికారిచేస్తే మంచి ఫలితం వుంటుంది.

Read Also : Ragi Cultivation : రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. సమగ్ర యాజమాన్య పద్ధతులు