Untimely Rains : అకాల వర్షాల కారణంగా వరిపంట నీటిముంపుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్‌ ఎరువులు పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది

Untimely Rains : అకాల వర్షాలు రైతులు వేసిన పంటలకు తీవ్రనష్టాలను కలిగిస్తాయి. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న సమయంలో ఏలాంటి యాజమాన్య పద్దతులు పాటించాలో తెలియని పరిస్ధితుల్లో రైతులు అందోళనలో ఉంటారు. ఈ అకాల వర్షాల కారణంగా ఒక్కోసారి పంట దెబ్బతినటంతోపాటు, పంటదిగుబడి తగ్గటం, నాణ్యతను దెబ్బతీయటం వంటి పరిస్ధితులు చవి చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా వర్షాల తరువాత చీడపీడల సమస్య అధికమౌతుంది. ముఖ్యంగా వరి పంటను పండించే రైతులు అకాల వర్షాల తరువాత కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టటం ద్వారా పంటను కాపాడు కోవచ్చు.

అకాల వర్షాల తరువాత వరిలో జాగ్రత్తలు ;

పెరుగుదల దశలో వరి పైరు నీటిముంపుకు గురైతే పొలంలో ముంపునీటిని వీలైనంత త్వరగా బయటకు పంపించాలి. ఎకరానికి 30 కిలోల యూరియా మరియు 15 కిలోల పొటాష్‌
ఎరువులు పైపాటుగా వేయాలి. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, ఈ తెగులు వరిలో దుబ్బుచేసే దశ నుండి ఆకులపై మచ్చలు ఏర్పడి క్రమేణా పెద్దదై పాముపాడ మచ్చలుగా మారుతాయి. ఉధృతి ఎక్కువైనట్లయితే మొక్కలు ఎండి వాడిపోతాయి. దీని నివారణకు ప్రోపికొనజోల్‌ 1 మి.లీ. లేక హెక్సాకొనజోల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి దుబ్బుకి తగిలేల 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

అలాగే వరిలో అగ్గితెగులు ఉధృతికి ఈ వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి. అగ్గి తెగులు సోకినప్పుడు ముదురు ఆకులపై నూలు కండే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబడతాయి. క్రమేపీ మచ్చలు కలసిపోయి పంట ఎండిపోయినట్లు ఉంటుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా లేదా కసుగామైసిన్ 2మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరిలో తుప్పు మచ్చలు (జింక్‌ లోపం) ఉండే వరి నాటిన 2 నుండి 6 వారాల్లో ముదురాకు చివరిలో ఈనెకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుకరంగు మచ్చలు కనపడతాయి. అకులు చిన్నవిగా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం వస్తుంది. మొక్కలు గిడసారి బారి దుబ్బు చేయవు. లీటరు నీటికి 2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ను కలిపి 5 రోజుల వ్యవధిలో 2 లేక ౩ సార్లు పిచికారి
చేయాలి. అవసరాన్ని బట్టి వరి పనలపైన 5 శాతం మెత్తటి ఉప్పును తడిచిన గింజెల పైన పలుచగా చల్లుట వల్ల మొలక రాకుండా కొంత వరకు నివారించవచ్చును.

 

ట్రెండింగ్ వార్తలు