Kharif Crops : ఖరీఫ్ పంటల్లో చీడపీడల నివారణ

Kharif Crops : ఖరీఫ్ పంటలు చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రబీపంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే చివరి దశలో ఉన్న వేరుశనగలో చీడపీడలు ఆశించాయి.

Prevention of Pests in Kharif Crops

Prevention of Pests in Kharif Crops : ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పలు ఖరీఫ్ పంటల్లో చీడపీడల ఉదృతి పెరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని తీసుకునే వీలుంది. అయితే ఏఏ పంటల్లో ఎలాంటి సమస్యలు తలెత్తాయి.. వాటి నివారణకు చేపట్టాల్సిన యాజమన్య పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం…

ఖరీఫ్ పంటలు చాలా వరకు చివరి దశకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల రబీపంటలకు సిద్ధమవుతున్నారు రైతులు. అయితే చివరి దశలో ఉన్న వేరుశనగలో చీడపీడలు ఆశించాయి. అలాగే మిరప, టమాట, పసుపు పంటల కూడా చీడపీడలు ఆశించినట్లు రైతులు చెబుతున్నారు.  ముఖ్యంగా చాలాచోట్ల  వేరుశనగలో టిక్కాఆకుమచ్చ తెగులు గమనించడమైనది. నివారణకు 1.0 మి.లీ. టేబ్యుకోనజోల్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వేరుశనగలో ఆకుముడత పురుగు గమనించడమైనది. నివారణకు 2.5 మి.లీ. క్లోరిపైరిపాస్ లేదా 1.5గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు గమనించడమైనది. నివారణకు, జల్లెడ ఆకులు ఏరి పురుగులను నాశనం చేయాలి. ఎకరానికి 10 నుండి 15పక్షి స్థావరాలను ఏర్పర్చుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5 శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి.  ఎదిగిన లార్వా నివారణకు 1మి.లీ. నోవాల్యురాన్ లేదా 0.2 మి.లీ. ఫ్లూబెండమైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరపలో పూత పురుగు గమనించడమైనది. నివారణకు, పూత దశలో 5 మీ.లి వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉదృతి ఎక్కువగా ఉంటే 1.6 మీ.లి కార్బోసల్ఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో శనగపచ్చ పురుగు గమనించడమైనది. నివారణకు, 0.5 మి.లీ. ఫ్లూబెండమైడ్ + థయాక్లోప్రిడ్ లేదా 1.2మి.లీ. ఏమమేక్టిన్ బెంజోట్ + ఫిప్రోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మిరపలో బూడిద తెగులు గమనించడమైనది. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా 1మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5 గ్రా. టేబుకొనజోల్ + గంధకము లేదా 1.5 గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు  తామురు పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ఎకరానికి 8 నుండి 10 జిగురు అట్టలను అమర్చాలి.

థయాక్లోప్రిడ్ 2 మి.లీ. లేదా 2 మి.లీ. క్లోర్ ఫెనఫిర్ లేదా 2.5మి.లీ. టోల్ ఫెన్ పైరాడ్ లేదా 1.2గ్రా. డైఫెన్ థయూరాన్ మందును 5మి.లీ. 1500పిపియం వేపనూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో ఆకుమాడు తెగులు గమనించడమైనది. నివారణకు 3 గ్రా. మాంకోజేబ్ లేదా 1 మిలీ. ప్రోపికొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. టమాటలో పొగాకు లద్దెపురుగు, శనగ పచ్చ పురుగు మరియు సూది పురుగుల నివారణకు  ఉదృతిని గమనించడానికి ఎకరాకు 10 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. అజాడిరక్టిన్  2 నుండి 3 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి పిచికారి చేయాలి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పసుపులో దుంప, వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 2.5గ్రా. మేఫేనొక్షమ్ మరియు మ్యాంకోజేబ్ లేదా 2గ్రా. కాప్టాన్ లేదా 3గ్రా. కాపల్ఆక్సీక్లోరైడ్ మందును మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలలో పసుపులో దుంప తొలుచు ఈగ ఆశించుటకు అనుకూలం. ముందు జాగ్రత్త చర్యగా ఎకరాకు 100కిలోల వేప పిండిని మొక్కల మధ్య వేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పసుపులో ఆకు మచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు, 1.0గ్రా. తయోఫెనేట్ మిథైల్ లేదా 1 మి.లీ. ప్రోపికొనజోల్ లేదా 2 మి.లీ. హెక్షాకొనజోల్ మందును 1మి.లీ. శాన్ డోవిట్ లేదా ధనువిట్ తో పాటు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Read Also : Coffee Beans : విశాఖ ఏజన్సీలో విరగ్గాసిన కాఫీ తోటలు – గింజల సేకరణలో పాటించాల్సిన జాగ్రత్తలు