rabi onion cultivation techniques in telugu
Rabi Onion Cultivation : నిత్యావసరంగా నిత్యం వాడుకలో వుండే కూరగాయ – ఉల్లి. ప్రధానంగా కర్నూలు జిల్లా దీని సాగుకు పెట్టింది పేరు. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , మహబూబ్ నగర్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్నా, కర్నూలు జిల్లాలో అధికంగా ఉల్లి సాగవుతోంది. ప్రస్తుతం పైరు ఎదుగుదల దశ నుంచి గడ్డ ఊరే వరకు వివిధ దశల్లో వుంది. ఉల్లి సేంద్రీయ ఎరువులకు బాగా స్పందిస్తుంది. ఈ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే మనం అందించే ఎరువులు, నీటి యాజమాన్యం చాలా కీలకం. మరి ఏ ఏ సమయంలో వాటిని అందించాలో ఇప్పుడు చూద్దాం..
ఉల్లి పంటకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాలు అనుకూలంగా వున్నా… రబీ పంటలో అధిక దిగుబడి వస్తుంది. గడ్డ నాణ్యత అధికంగా వుంటుంది. రబీ ఉల్లిని నవంబర్, డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు నాటతారు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు ఈ పంటకు అనుకూలంగా వుంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120నుంచి 150రోజుల పంటకాలంలోఎకరాకు 100 నుంచి 130క్వింటాళ్ల వరకు మనరైతులు దిగుబడులు సాధిస్తున్నారు. ఇప్పటికే చాలాప్రాంతాల్లో ఉల్లినారు నాటగా, నారు పోయటం ఆలస్యమైన ప్రాంతాల్లో ప్రస్తుతం వేసవి పంటగా ప్రధాన పొలంలో నాట్లు వేయటానకి రైతాంగం సన్నద్ధమవుతున్నారు. ఈ పంట ఏప్రెల్ నెల వరకు కొనసాగుతుంది.
ఉల్లి దిగుబడులను సేంద్రీయఎరువులు ప్రభావితం చేయగలదు. అందుకే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేస్తే గడ్డ బాగా ఊరి మంచి దిగుబడి వస్తుంది. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60 నుండి 80 కిలోల నత్రజని, 24 నుండి 32 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజనితో పాటు పొటాష్ ని రెండు దఫాలుగా అంటే నాటినప్పుడు, నాటిన 30 రోజుల తరువాత వేసుకోవాలి. దీంతె గడ్డ బాగా ఊరుతుంది. రసాయన ఎరువులతో పాటు జీవన ఎరువులైన అజోస్పైరిల్లం లేదా ఫాస్పోబ్యాక్టీరియం 2 కిలోలు ఒక ఎకరా చొప్పున వాడితే మంచి దిగుబడులు తీసేందుకు అస్కారం ఉంటుంది. ఒక హెక్టారుకు 20 నుండి 25 కిలోల సల్ఫర్ ను ఆఖరిదుక్కిలో వేస్తే గడ్డ ఘాడత పెరుగుతుంది.
ఉల్లిసాగులో మనం చేపట్టే పోషక యాజమాన్యంతోపాటు అందించే నీటితడుల విషయంలోను జాగ్రత్తగా వుండాలి. నాటిన 60 రోజుల వరకు 12 నుండి 15 రోజుల వ్యవధితో నాలుగు ఐదు తడులు ఇవ్వాలి. గడ్డ ఊరేదశలో 6 నుండి 7 రోజుల వ్యవధిలో ఏడెనిమిది తడులను అందిచాలి. కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టుట ఆపాలి. తేలికపాటి నేలల్లో నీటితడులను ఎక్కువగా ఇవ్వాలి.
Read Also : Besan Cultivation : శనగలో పురుగులను అరికట్టే పద్ధతులు