Sesame Crop Farming
Sesame Crop Farming : నీటి వసతి వున్న రైతాంగం రబీ పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా వుండి దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. రబీ నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి. వెంకటరావు.
Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు
రబీ సీజన్‌లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. నువ్వు గింజల్లో నూనె శాతం 45 నుండి 55 వరకు , ప్రొటీన్ల శాతం 25 వరకూ ఉంటాయి.
వేసవి కాలంలో రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ వుండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మనదేశం 2 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు.
కోస్తా , రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8 వేల నుంచి 9వేల ధర పలుకుతున్నాయి.
ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం . అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పి. వెంకటరావు.
నువ్వుసాగులో కలుపు నివారణ చాలా ముఖ్యం. కలుపు మొక్కలు ప్రధాన పంటకంటే ఎత్తు పెరగకుండా సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. నువ్వులు నూనెజాతి పంట కాబట్టి అధికంగా సల్ఫర్ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లైతే మంచి దిగుబడులు పొందవచ్చు.
నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలిదశలో బీహారి గొంగళిపురగు, పొగాకు లద్దెపురుగు తీవ్రనష్టం చేస్తుంటాయి. లేతమొగ్గదశలో కోడుఈగతో పాటు తెగుళ్ళు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలి.
సాధారణంగా నువ్వులో ఎకరాకు 5 నుండి 6 క్వింటాల దిగుబడిని పొందవచ్చు . అయితే సకాలంలో సరైన నీటితడులు ఇచ్చి, రెండు దఫాలుగా నీటిలో కరిగే ఎరువులను పిచికారి చేస్తే ఎకరాకు 10 నుండి 11 క్వింటాల వరకు దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించినట్లైతే అధిక దిగుబడి పొందవచ్చు.