Sesame Cultivation : వేసవి రబీకి అనువైన నువ్వు రకాలు – అధిక దిగుబడులకు సూచనలు
Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు.
- Sreehari A
- Published On : January 14, 2025 / 02:34 PM IST
Sesame Cultivation
Sesame Cultivation : నీటి వసతి వున్న రైతాంగం వేసవి పంటగా నువ్వుసాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి వుంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా , ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనుషా.
Read Also : Agriculture Tips : నీరు నిలిస్తే.. పంట చేలకు చేటే..
వేసవిలో రైతులు పండించే నునెగింజ పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. రెండు మూడు నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంటను సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ వేసవి నువ్వును విత్తుతారు.
కోస్తా , రాయలసీమ జిల్లాల్లో డిసెంబరు మొదటి పక్షం నుంచి జనవరి చివరి వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా వుంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్థుతం మార్కెట్లో క్వింటా నువ్వులు రూ. 9 వేల వరకు పలుకుతున్నాయి.
ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం వుండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం . అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, ఎరువుల యాజమాన్యం, నీటి తడులు సకాలంలో అందించగలిగితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా, ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనుషా.
నువ్వు పంటకు చీడపీడలు ఆశించి నష్టం చేస్తుంటాయి. ముఖ్యంగా తొలిదశ నుండే రసంపీల్చే పురుగులు, ఆకుముడత, బీహారి గొంగళిపురగులు ఆశించి తీవ్రనష్టం చేస్తుంటాయి. లేత మొగ్గ దశలో కోడుఈగతో పాటు తెగుళ్ళు ఆశించడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సకాలంలో వీటిని నివారించేందుకు సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త.
Read Also : Rabi Season : వేసవికి అనువైన నువ్వు రకాలు – అధిక దిగుబడికి యాజమాన్యం
