Success Story Of Agakara Farmer in Telugu
Agakara Farmer : ఆగాకర. నాలుగేళ్ల క్రితం వరకు మార్కెట్లో అక్కడక్క కనిపించే ఈ కూరగాయ, ఇప్పుడు విరివిగా లభ్యమవుతోంది. ధర మాత్రం మిగితా కూరగాయలకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కవే. అయినా.. ఆగాకరలోని విశిష్ఠ ఔషధ గుణాల వల్ల, మార్కెట్ గిరాకీ అధికం. దీని విస్తీర్ణం తక్కువ వుండటం వల్ల, సాగు చేసిన రైతుకు కూడా లాభాలు ఆశాజనకంగా వున్నాయి. స్థానికంగా దొరికే కర్రలతో అతి తక్కువ ఖర్చుతో పందిర్లను ఏర్పాటు చేసుకుని 15 ఏళ్లుగా సాగు చేపడుతూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.
కూరగాయల్లో రారాజు ఆగాకర అంటే అతిశయోక్తి కాదు. ధరలోనూ ఇదే కింగ్. ధర ఎంత పెరిగినా జనం ఇష్టపడి మరీ కొనుగోలు చేసే కూరగాయల్లో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఆదరణ, డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీనిని సాగు చేసిన రైతులందరూ అధిక లాభాలు సాధిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, జంగంగూడెం గ్రామనికి చెందిన రైతు లాజర్ 15 ఏళ్లుగా ఆగాకర సాగుచేస్తూ.. లాభాలు గడిస్తున్నారు.
మార్కెట్‌లో అధిక ధర, డిమాండు ఉన్న ఆగాకర పంట విత్తనాలు విత్తిన మూడు నెలలకే చేతికొస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందుకునే ఈ పంటను… వేసవిలో పొలం మొత్తగా దుక్కి చేసి జూన్, జులైల్లో నాటుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ పంట దిగుబడి వస్తుంది. రైతు లాజర్ 80 సెంట్లలో సాగు చేపట్టారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిరి వేసుకున్నారు. డ్రిప్ ద్వారా నీరు, ఎరువులను అందిస్తున్నారు. మూడు నెలల పాటు దిగుబడి వస్తుంది. వారానికి 4 క్వింటాళ్ల దిగుడిని పొందుతున్న రైతు మార్కెట్ లో సరాసరి కిలో 70 రూపాల చొప్పున అమ్ముతున్నారు. ఇతర పంటలతో పోల్చితే ఆగాకర సాగులో అధిక లాభాలు ఉంటాయంటున్నారు.
ఇటీవల కాలంలో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూరగాయ పంటల సాగు పెరిగింది. అయితే పందిళ్లు, స్టేకింగ్ వేసుకునేందుకు ఉద్యాన శాఖ సబ్సిడీలు అందిస్తే.. కూరగాయల సాగు మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
Read Also : Taiwan Lemon : నాటిన 8 నెలలకే దిగుబడి వస్తున్న తైవాన్ నిమ్మ