Sugarcane Cultivation :
Sugarcane Cultivation : చెరుకు సాగు చేపట్టాలనుకునే రైతులు ప్రారంభం నుండే సరైన యాజమాన్య పద్దతులు పాటించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. చెరకు సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వర్షాధార చెరకు నేలను లోతు దుక్కి చేసి ఎకరానికి పది టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును వేసుకోవాలి.
80 సెంటీ మీటర్ల ఎడంతో చెరకు సాళ్లను ఏర్పాటు చేసుకోవాలి. చెరకు విత్తనాన్ని విత్తుకునే ముందుగా 10శాతం సున్నపు నీటిలో ఒక గంట సమయం పాటు ఉంచుకోవాలి. దీని వల్ల మొలక శాతం , పంట నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
చెరకు నాట్లు వేసుకునేందుకు ముందు ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ , 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను చెరకు చాళ్లలో వేసుకోవాలి. చెరకు ముచ్చెలు నాటిన మూడు రోజుల లోపు నేలపై ఎకరానికి రెండు కిలోల అట్రాజిన్ కలిపిన రసాయనాన్ని పిచికారీ చేయాలి. చెరకు నాటిన మూడు రోజుల లోపుగా ఎకరానికి 1.2 టన్నుల చెరకు చెత్తను కప్పడం ద్వారా నేలలోని తేమ రక్షించుకోవచ్చు. కలుపు ఉధృతి, పీక పురుగు ఉదృతి తగ్గుతుంది.
వర్షాధారంగా జూన్ లో నాటిన చెరకు తోటలకు మొదటి దఫా నత్రజని ఎరువును ఎకరానికి 30 కిలోల వంతున వేసుకోవాలి. దీర్ఘకాలిక బెట్ట పరిస్ధితుల్లో లీటరు నీటికి 25 గ్రాముల చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి