Trichoderma Viride : శిలీంధ్రానికి శిలీంధ్రమే విరుగుడు – రైతు నేస్తంగా మారిన ట్రైకోడెర్మా విరిడె

Trichoderma Viride Preparation : బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా వున్న వేరుకుళ్లు, మొదలుకుళ్లు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్ధవంతంగా అరికట్టవచ్చు.

Trichoderma Viride Preparation : పంటల్లో చీడపీడలు బెడద వల్ల దాదాపు 30-35శాతం దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా వుంది. ముఖ్యంగా ఎండుతెగులు, వేరుకుళ్లు తెగుళ్లవల్ల, రైతుకు పెట్టుబడి కూడా చేతికిరాని సందర్భాలు అనేకం. వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటంవల్ల పర్యావరణం కలుషితం అవటంతో పాటు, పూర్తిస్థాయిలో నష్ట నివారణ సాధ్యపడటం లేదు.

అయితే ఈ శిలీంధ్రపు తెగుళ్లను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతులముందే వుంది. ట్రైకోడెర్మావిరిడె పేరుతో జీవ శిలీంధ్రాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. అంటే.. ఇక్కడ శిలీంద్రానికి శిలీంద్రమే విరుగుడన్న మాట. ట్రైకోడెర్మా విరిడెను అభివృద్ధిచేసి పంటల్లో వాడే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Agriculture Tips : ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో పంటల్లో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ

ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. ఇది పంటలకు హాని కలిగించే శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది. వివిధ పంటల్లో శిలీంధ్రపు తెగుళ్లైన ఎండు తెగులు, వేరుకుళ్లు తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టటానికి ట్రైకోడెర్మావిరిడి జీవ శిలీంధ్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఫంగస్ ఆధారిత జీవరసాయనం. తెల్లటి పొడి రూపంలో మార్కెట్లో వివిధ పేర్లతో రైతులకు అందుబాటులోవుంది. దీన్ని పశువుల ఎరువులో కలిపి భూమిలో తేమ వున్నప్పుడు దుక్కిలో వెదజల్లితే భూమి ద్వారా వ్యాప్తిచేందే శిలీంద్రపు తెగుళ్లను నాశనంచేస్తుంది.

బత్తాయి, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల తోటల్లో ప్రధాన సమస్యగా వున్న వేరుకుళ్లు, మొదలుకుళ్లు వంటి తెగుళ్లను ట్రైకోడెర్మా విరిడిని వాడి సమర్ధవంతంగా అరికట్టవచ్చు. పప్పుజాతి పంటలు, పత్తి వంటి పంటల్లో ట్రైకోడెర్మాతో విత్తనశుద్ధి చేస్తే,  విత్తనం ద్వారా వ్యాపించే శిలీంద్రాలను సమర్ధంగా అరికట్టవచ్చు.శిలీంధ్రపు తెగుళ్లు  ప్రధాన సమస్యగా వున్న భూముల్లో ముందుగా ట్రైకోడెర్మావిరిడిని పశువుల ఎరువులో వృద్ధిచేసి తేమ వున్నప్పుడు ఆఖరిదుక్కిలో వేసినట్లైతే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మొలాసిస్ లేదా ఈస్ట్‌ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా  ఫెర్మంటర్‌లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు.

రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో ఎలా వృద్ధిచేయాలో తెలుసుకుందాం. 90కిలోల బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీనికి 10కిలోల వేపపిండిని కలిపాలి. దీన్ని నీడవున్న ఎత్తైన ప్రదేశంలో  చదరంగా గుట్టగా పోయాలి. దీనిపై 1 నుండి 2 కిలోల ట్రైకోడెర్మావిడిని పొరలు పొరలుగా చల్లాలి. దీనిపై 1కి. బెల్లాన్ని కలిపిన నీటిని, పశువుల ఎరువుపై చల్లాలి. బెడ్ తేమగా వుండే విధంగా నీరు చిలకరించాలి. తేమ ఆవిరికాకుండా దీనిపై గోనెపట్టాలు కప్పి వుంచాలి.  రోజూ నీరు చిలకరిస్తుంటే 7-10రోజుల్లో ట్రైకోడెర్మా శిలీంద్రం.. ఎరువు మొత్తం వ్యాపిస్తుంది. గొనెపట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బూజు ఆక్రమించి వుండటం గమనించవచ్చు.

ఈ సమయంలో దీన్ని పొలంలో తేమ వున్నప్పుడు సమానంగా వెదజల్లాలి. పండ్లతోటల్లో నీరు పెట్టినతర్వాత ఈ ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని పాదుచుట్టూ సమానంగా వెదజల్లితే,  వేరుకుళ్లు, మొదలుకుళ్లును సమర్ధవంతంగా అరికట్టవచ్చు. పంటలు విత్తేటప్పుడు, విత్తనశుద్ధిగా, కిలో విత్తనాలకు 8 గ్రాముల ట్రైకోడెర్మాను పట్టించాలి. దీనివల్ల మొక్కల వేర్ల చుట్టూ, ట్రైకోడెర్మా శిలీంద్రం అభివృద్ధి చెంది, వేరుకుళ్లు తెగులు నుంచి పంటను రక్షిస్తుంది.

దీన్ని రసాయన ఎరువులు, పురుగు మందులతో కలిపి వాడకూడదు. ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలి. జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులతో కలిపి వాడవచ్చు. ట్రైకోడెర్మాను చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తయారు చేసిన ఆరు నెలల్లోగా వాడుకోవాలి. ప్రస్థుతం కిలో పాకెట్ ధర 100-120రూపాయలకు మార్కెట్లో లభ్యమవుతుంది. తక్కువ ఖర్చుతో శిలీంద్రపు తెగుళ్లను నివారించగల ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రాన్ని పర్యావరణ హితంగా, రైతు మిత్రునిగా చెప్పుకోవచ్చు.

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

ట్రెండింగ్ వార్తలు