Turmeric Crop Cultivation
Turmeric Crop Cultivation : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో 81 వేల 445 వందల హెక్టార్లలో సాగవుతుంది. దాదాపు 4 నుండి 5 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నాం . ఇప్పటికే పసుపు దుంప తీతలు మొదలయ్యాయి. ఈ సమయంలో నాణ్యమైన పసుపు ఉత్పత్తికి చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా వుంటుంది. పసుపుసాగులో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుండగా…దాదాపు 40శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో వుండటం గర్వకారణం.
పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషద, సుగంధ పరిశ్రమల్లోను, కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పసుపులో అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. మహేందర్
నాణ్యమైన పసుపు ఉత్పత్తి కోసం :
ప్రస్తుతం పసుపు దుంప తీతలు జరుగుతున్నాయి. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి సరైన పక్వదశలో దుంపతీయడంతో పాటు దుంపను ఉడకబెట్టేటప్పుడు, ఆరబెట్టేటప్పుడు రైతులు అత్యంత మెళకువతో వ్యవహరించాలి. ఆదునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం వలన రైతులకు ఖర్చుతగ్గడంతో పాటు కూలీల కొరతను సులభంగా అధిగమించే అవకాశం ఏర్పడింది .
దుంపలు తవ్విన తర్వాత తల్లి దుంపలు, పిల్ల దుంపలు వేరుచేయాలి. అదే విధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిన తొలగించాలి. తల్లి పసుపును, కొమ్ములను వేరుచేయాలి. పసుపు ఉడికించే బానెలు లేదా కడాయిలో దుంపలు, కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమానంగా మంటపెట్టాలి.
45, 60 నిమిషాలకు తెల్లటి నురగ పొంగు , పసుపుతో కూడిన వాసన పొగలు వస్తున్నప్పుడు తడకెపై నీరు అంచుకొని కుప్పలు కుప్పలుగా పోయాలి. 24 గంటల తరువాత రెండు మూడు అంగుళాల మందముగా పరచాలి. కనీసం 10 నుండి 15 రోజులలో పసుపు ఎండుతుంది. ఎండిన పసుపు కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే 8-10 శాతం తేమ కల్గినట్లు గమనించాలి.
Read Also : Sesame Crop Farming : నువ్వు సాగులో ఈ సూచనలు పాటిస్తేనే అధిక దిగుబడులు
ఎండిన దుంపలు , కొమ్ములు మెరుపు పెట్టు డ్రమ్ములలో లేదా ట్రాక్టరుకు అమర్చిన మెరుగు డ్రమ్ములలో పాలిషింగ్ చేసుకోవాలి. ఆఖరు దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే ఆకర్షణీయంగా కనబడి మంచి ధర పలుకుతుంది. పాలిషింగ్ అయిన దుంపలు, కొమ్ములను ఎగుమతి దృష్ట్యా శుభ్రమైన నూత గోనె సంచులు వాడాలి . లోపల పాలిథిన్ పూత ఉన్న గోనె సంచులను వాడటం శ్రేయస్కరం.