Broccoli Farming
Broccoli Farming : క్యాబేజి, కాలీప్లవర్ జాతికి చెందిన కూరగాయ పంట బ్రోకోలి . ఇతర దేశాల్లో ఏడాది పొడవునా సాగవుతున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శీతాకాలమే అనుకూలం. అధిక పోషక విలువలు ఉండి, మార్కెట్ లో మంచి ధర పలుకుతున్న ఈ పంటసాగు ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. రైతులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీని డిమాండ్ దృష్ట్యా కొంతమంది రైతులు పాలీహౌస్ లలో కూడా బ్రొకొలి సాగుచేస్తున్నారు. ఈ పంట సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మండలం, వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా. బి.వి.జి ప్రసాద్.
READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట
శీతాకాలంలో పండించే కూరగాయపంటల్లో బ్రోకోలి చాలా ముఖ్యమైంది. క్యాబేజీ, కాలీఫ్లవర్ జాతికి చెందిన ఈ పంట, చూడటానికి కాలీఫ్లవర్‌లా కన్పించినా, పువ్వు ఆకుపచ్చగా ఉంటుంది. అన్ని సూపర్‌మార్కెట్లలోనూ దొరుకుతుంది. ఎన్నో పోషక విలువలున్న బ్రొకొలితో సలాడ్, సూప్స్ లే కాక, కూరగాయ కూడా ఉపయోగించుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ విస్తీర్ణంలోఈ పంట సాగులో వుంది. ఇందులో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ , క్యాన్సర్ ను నిరోధించే సల్ఫర్ రోఫిన్ పుష్కలంగా ఉండటంతో అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో దీనికి అధిక డిమాండ్ వుంది.
READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు
మన ప్రాంతంలో దీని వినియోగంపై సరైన అవగాహన లేకపోవటంతో సాగు విస్తరించలేదు. అయితే ఇటీవలికాలంలో నగరాల్లో డిమాండ్ పెరుగుతుండటంతో కొంతమంది రైతులు మార్కెటింగ్ అవకాశాలను గమనించి సాగులో ముందడుగు వేస్తున్నారు. పాలీహౌస్ లలో వాతావరణాన్ని నియంత్రించే అవకాశం వుండటంతో ఏడాది పొడవునా దీని సాగును విస్తరిస్తున్నారు. దీనికి కారణం కిలో బ్రొకొలి 200 రూపాయలకు పైగా ధర పలకటమే. ఈ పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే మన ప్రాంతానికి అనువైన రకాల ఎంపిక తో పాటు సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మండలం, వెంకటరామన్న గూడెం ఉద్యాన పరిశోధనాస్థానం శాస్త్రవేత్త డా. బి.వి.జి ప్రసాద్.
READ ALSO : Agriculture: ఎకరంలో పది పంటలు పండిస్తున్న రైతు
ఇది శీతాకాలం పంట కాబట్టి నీటి అవసరం అంతగా లేకపోయినపట్టికీ , కనీస నీటిని అందించాల్సి ఉంటుంది. క్యాబేజి, కాలీప్లవర్ ను ఆశించే తెగుళ్లే ఈ పంటకు ఆశిస్తాయి. ముఖ్యంగా సూక్ష్మపోషకాల లోపాన్ని ఎప్పటికప్పుడూ గుర్తించి తగు జాగ్రత్తలు పాటించినట్లైతే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది
బ్రొకొలిని కాలీఫ్లవర్ లాగానే ఎకరాకు 16నుంచి 20వేలు మొక్కలు వచ్చే విధంగా నాటుకోవచ్చు. నాటిన 60రోజుల తర్వాత పూత ప్రారంభమవుతుంది. పూత వచ్చిన 20 నుంచి 25రోజుల్లో పువ్వు తయారై కోతకు సిద్ధమవుతుంది. పువ్వు మొత్తం ముదురు ఆకుపచ్చరంగుకు వచ్చిన తర్వాత కోయాల్సి వుంటుంది. సాగులో సరైన యాజమాన్యం చేపడితే ఎకరాకు 5 టన్నుల దిగుబడి తీసినా, మార్కెట్ లో కిలో ధర రూ. 150 నుండి 200 పలుకుతోంది . రైతు స్థాయిలో కిలో ధర రూ. 100 పలికినా రూ. 5 లక్షల ఆదాయం వచ్చే వీలుంది. తక్కువ సమయంలో కమర్షియల్ పంటల్లో ఇంత సంపాదన తెచ్చిపెట్టే పంట మరొకటి లేకపోవటంతో రైతులకు బ్రొకొలి సాగు ఒక వరంలా మారింది.