అడిగివారు లేరు.. పట్టించుకునేవారు లేరు.. అనుకున్నదే తడవుగా అందినకాడికి దండుకున్నారు. ఆఖరికి మందుల షాపుల నుంచి
అడిగివారు లేరు.. పట్టించుకునేవారు లేరు.. అనుకున్నదే తడవుగా అందినకాడికి దండుకున్నారు. ఆఖరికి మందుల షాపుల నుంచి దొంగ బిల్లులు సృష్టించి మరీ అవినీతికి పాల్పడ్డారు. ఇక డిమ్స్ సిబ్బంది అయితే కుటుంబసభ్యుల పేరుతో బినామీ సంస్థల్ని ఏర్పాటు చేసి మరీ అక్రమాలకు పాల్పడ్డారు. మరికొందరి దందాపై కూడా అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మందుల్లో 51కోట్ల 2 లక్షలు.. ల్యాబ్ కిట్లలో 85కోట్ల 32 లక్షలు:
సర్జికల్ ఐటమ్స్ కూడా 47.77 కోట్లతో టెండర్ లేకుండానే కొనుగోలు చేశారు. ఈఎస్ఐ సంస్థ 2018-19 సంవత్సరానికి నిర్ణయించిన రేట్ కాంట్రాక్టు కంటే ఇది 10.43 కోట్ల రూపాయలు అదనం. ఇక 6 కోట్ల 62 లక్షలతో ఫర్నిచర్ కొన్నారు. ఇది కూడా మార్కెట్ ధర కంటే 4 కోట్ల 63 లక్షలు ఎక్కువ. ఇది టెండర్లు లేకుండానే కొనుగోలు చేశారు. మందుల్లో 51 కోట్ల 2 లక్షలూ, ల్యాబ్ కిట్లలో 85 కోట్ల 32 లక్షలూ, సర్జికల్ ఐటెమ్స్ లో 10 కోట్ల 43 లక్షలూ, ఫర్నీచర్లలో 4 కోట్ల 63 లక్షలూ మొత్తం కలపి 151 కోట్ల 40 లక్షలు అదనంగా ఖర్చు చేశారని గుర్తించామన్నారు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్.
రూ.17వేలు ఖరీదు చేసే మెషిన్‌కు రూ.70వేల చెల్లింపులు:
టెలీ హెల్త్‌లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని విచారణలో తేలిందంటోంది ఏసీబీ. రూపాయి 80 పైసలు వసూలు చేసే దగ్గర 4 రూపాయల 80 పైసలు వసూలు చేసి.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు గుర్తించామన్నారు. రాశి ఫార్మా, వీరేశ్ ఫార్మా సంస్థల పర్చేజ్ – సేల్ ఇన్ వాయిస్‌ల మధ్య ఉన్న తేడా ప్రకారం చూస్తే 5 కోట్ల 70 లక్షలు అదనంగా చెల్లించారు. ఇక 9.50 కోట్ల రూపాయల మందుల ఆర్డర్లను పొందారు జెర్కాన్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో ఫార్మాసిస్ట్‌గా ఉన్న కె. ధనలక్ష్మి కోడలు రావిళ్ల రవి తేజస్వి. ఈ సంస్థకు రమేశ్ కుమార్, విజయ కుమార్‌ల హయాంలో ఆర్డర్లు ఇచ్చారు. ఇక జలం ఎన్విరాన్మెంట్ సంస్థకు ఇచ్చిన ఆర్డర్లలోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. ప్రొడిజి సంస్థ నుంచి 17 వేలు ఖరీదు చేసే బయో మెట్రిక్ మెషీన్‌కి 70 వేల చొప్పున వంద మెషీన్లు కొన్నారని విజిలెన్స్ తేల్చింది.
ప్రతీ ఆంశంలోనూ కొటేషన్లు మార్చినట్టు గుర్తింపు:
విచారణలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు అధికారులు. ప్రతీ అంశంలో కొటేషన్లు మార్చినట్టు గుర్తించామన్నారు. కొటేషన్ల కవర్లపై ఉన్న చేతిరాత ఈఎస్ఐ సిబ్బందివేనని అంటున్నారు విజిలెన్స్ అధికారులు. ఇంత చేసినా కార్మికులకు ఉపయోగపడిందా అంటే అదీ లేదంటున్నారు అధికారులు. కొన్నవాటిలో చాలా మందులు, ఇతర పరికరాలు ఏడాదిగా ఉపయోగం లేకుండా పడున్నాయని విజిలెన్స్ నివేదిక చెబుతోంది.
రేట్ కాంట్రాక్ట్ లేని కంపెనీలకు రూ.51కోట్ల చెల్లింపులు:
ఈఎస్ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని.. లేని కంపెనీల నుంచి నకిలీ కోటేషన్లు తీసుకొని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు 51 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరిని బాధ్యులుగా గుర్తించారు. మందులు పరికరాల వాస్తవ ధరకంటే 136 శాతం అధికంగా సంస్థలు టెండర్లు చూపించినట్టు విచారణలో తేలింది. దీంతో అక్రమంగా 85 కోట్ల రూపాయలు చెల్లించినట్టు విచారణలో తేలింది. ఇంత పెద్ద మొత్తంలో జరిగిన స్కామ్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.