ఇద్దరు చిన్నారులపై మారుతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. కార్తీక్ అనే బాలుడిని గోడకేసి కొట్టి చంపింది. మరో బాలుడికి అట్ల పెనంతో వాతలు పెట్టింది. తీవ్ర గాయాలతో బాలుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారమిచ్చారు. మొదటి భార్య చనిపోవడంతో సాగర్ అనే వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు. గత కొద్దికాలంగా అతడి మొదటి భార్యపిల్లలని రెండో భార్య హింసిస్తోంది.
పూర్తి వివరాలు
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కే సాగర్‌కు ఎనిమిదేళ్ల క్రితం అనూష అనే మహిళతో పెళ్లి జరిగింది. ఆ దంపతులకు కవలల పిల్లలు ఆకాశ్, కార్తీక్ జన్మించారు.
Also Read: టీడీపీ జనసేన పొత్తు బలమైనదని ఇలా చాటిచెబుతున్న పవన్ కల్యాణ్
ఇద్దరికీ ఇప్పుడు ఆరేళ్లు. రెండేళ్ల క్రితం అనూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తదుపరి రోజే అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. అనూషకు పుట్టిన పాపను మరో దంపతులకు దత్తత ఇచ్చారు.
భార్య అనూష చనిపోవడంతో సాగర్ ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళలను రెండో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఏడు నెలల క్రితం ఓ ఆడబిడ్డ పుట్టింది. ఆకాశ్, కార్తీక్‌ని లక్ష్మి ప్రతిరోజు కొట్టేది.
ఈ విషయాన్ని తండ్రి సాగర్‌కు ఆ పిల్లలు చెబితే అతడు కూడా వారినే రెండు మూడు సార్లు కొట్టాడు. దీంతో లక్ష్మి చిత్రహింసలు పెడుతున్న విషయాన్ని సాగర్‌కు ఆ పిల్లలు ఆ తర్వాత చెప్పలేదు.
ఆకాశ్, కార్తీక్‌ని లక్ష్మి కొడుతుండగా చూసి స్థానికులు కొన్నిసార్లు మందలించారు. అయినప్పటికీ ఆమె మారలేదు. రెండు రోజుల క్రితం కార్తీక్‌ను లక్ష్మి దారుణంగా కొట్టింది. ఆకాశ్‌కు వాతలు పెట్టింది. దీంతో కార్తీక్ చనిపోగా ఆకాశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. లక్ష్మి, సాగర్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు.
ఆ చిన్నారుల మేనత్త విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సాగర్‌కు ఉన్న ఓ ఇంటిని పెద్దయ్యాక ఆకాశ్, కార్తీక్ దక్కకుండా చేయాలన్న కుట్రతోనే లక్ష్మి వారిని చిత్రహింసలు పెట్టి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.