Janga Krishna Murthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా.. చంద్రబాబుకి ఇబ్బంది కలగొద్దనే ఈ నిర్ణయం..!
నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు.
Janga Krishna Murthy Representative Image (Image Credit To Original Source)
- చంద్రబాబుకి రుణపడి ఉంటా
- నా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు
- కొండపై నా పేరుతో స్థలం ఉండాలని నేను ట్రస్ట్ ఏర్పాటు చేశా
Janga Krishna Murthy: జంగా కృష్ణమూర్తి టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకి పంపారు. ఇటీవల తిరుమలలో జంగా కృష్ణమూర్తి ట్రస్టుకు భూమి కేటాయిస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే, బోర్డు సభ్యుడిగా ఉంటూ తన ట్రస్టుకు భూమి కేటాయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు నిర్ణయాన్ని క్యాబినెట్ కూడా తప్పు పట్టింది. టీటీడీ నిర్ణయాన్ని రద్దు చేస్తామని వెల్లడించింది. ఈ పరిణామంతో జంగా కృష్ణమూర్తి మనస్తాపం చెందారు. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
చంద్రబాబుకి రుణపడి ఉంటా..
మూడోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబుకి రుణపడి ఉంటానన్నారు. నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. దీని వల్ల నేను కలత చెంది ఆవేదనగా ఉన్నానన్నారు. నా వల్ల సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకుండా ఉండాలని బోర్డు సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకి, టీటీడీ బోర్డు చైర్మన్ కు పంపానని తెలిపారు.
”గతంలోనే నాకు స్థలం కేటాయింపు జరిగినా నా దగ్గర డబ్బు లేక చెల్లించలేదు. దీంతో హైకోర్టుకు వెళ్ళాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయింపు చేయాలని రిక్వెస్ట్ చేశా. కొండపై నా పేరుతో స్థలం ఉండాలని నేను ట్రస్ట్ ఏర్పాటు చేశా. అక్కడ ఏ నిర్మాణం చేసినా ఆలయం పరిధిలోనే ఉంటుంది.
మేము ఎంత చెల్లించి నిర్మాణాలు చేసినా అవి స్వామి వారికే చెందుతాయి. వ్యక్తిగతంగా సంక్రమించవు.
కొన్ని శక్తులు ఇదంతా చేస్తున్నాయి..
గతంలో నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రిజెక్ట్ చేశారు. అప్పుడు నేను సీఎం దృష్టికి తీసుకెళ్లగా బోర్డుకు వెళ్ళింది. బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత మళ్లీ ఇదంతా జరుగుతోంది. కొన్ని శక్తులు ఇదంతా చేస్తున్నాయి. బలహీన వర్గాలకు చెందిన నేను దైవ సేవ చేయటం కోసం ప్రయత్నిస్తే ఇలా చేస్తున్నారు. నేను ఈ స్థాయికి సొంతంగా ఎదిగాను. కులం మద్దతుతో కానీ రాజకీయ మద్దతుతో కానీ కాదు” అని జంగా కృష్ణమూర్తి చెప్పారు.
Also Read: పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైరల్ చేస్తున్నారు.. వారికి చెబుతున్నా..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
