Actress Pratyushas Case Representative Image (Image Credit To Original Source)
Actress Pratyushas Case: నటి ప్రత్యూష తల్లి సరోజిని దేవి 10టీవీతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే తనకు పూర్తి న్యాయం జరగలేదన్నారు. సిద్దార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పటివరకు తన పోరాటం ఆగదన్నారు. తన కూతురి కేసులో సాక్ష్యాలను మాయం చేశారని సరోజిని దేవి ఆరోపించారు. తన కూతురిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని సరోజిని దేవి అన్నారు.
నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తాను నిందితుడిని కాదని సుప్రీంకోర్టులో సిద్ధార్ధ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు శిక్ష తగ్గించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రత్యూష తల్లి సరోజిని దేవి. అయితే సరోజిని దేవి పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయాలన్న సుప్రీంకోర్టు.. సిద్ధార్థ్ రెడ్డికి రెండేళ్ల జైలుశిక్ష, 50వేల జరిమానాను సమర్థించింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్ రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యూష కేసులో పోస్టుమార్టం నిర్వహించిన విధానంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోస్టుమార్టం సరైన పద్ధతిలో నిర్వహించలేదని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం అభిప్రాయపడింది.
గత 24ఏళ్లుగా కోర్టులో ప్రత్యూష కేసు నడిచింది. సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాల క్రితం ప్రత్యూష మృతి కేసు సంచలనం రేపింది. 2002 ఫిబ్రవరి 23న కూల్ డ్రింక్ లో ప్రత్యూష, సిద్ధార్ధ్ రెడ్డి పురుగుల మందు తాగారు. ఆ మరునాడు ఆమె చనిపోయింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధార్ధ్ రెడ్డికి శిక్షను పెంచాలంటూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. దీనిపై గత ఏడాది సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 2025 నవంబర్ లో తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
మరోవైపు నిందితుడు సిద్ధార్ధ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటిన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, 5వేల జరిమానా విధించారు. సిద్ధార్ధ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది. దీనిపైనే 2012లో సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి అప్పీల్ దాఖలు చేసింది. బలవన్మరణం చేసుకునేలా ప్రత్యూషను ఉసిగొల్పినందుకు సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.