Chintoor Agency: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. ఆ బిడ్డను అడవిలో వదిలేసింది. ప్లాస్టిక్ కవర్లో పసిబిడ్డను ఉంచి.. ఆ చిట్టడవిలో ఓ చెట్టుకొమ్మకు ఆ కవర్‌ను వేలాడదీసి వెళ్లిపోయింది. వేట నిమిత్తం అడవిలోకి వెళ్లిన ఓ యువకుడు పసికందు రోదన విని అక్కడికి వెళ్లి చూడగా.. ప్లాస్టిక్ కవర్లో పసికందు కనిపించింది. వెంటనే యువకుడు పసిబిడ్డను తీసుకొని తన గ్రామానికి వెళ్లి.. వైద్యులకు సమాచారం ఇచ్చాడు.
చింతూరు మన్యంలోని వీఆర్ పురం మండలం కందులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొక్కెరగూడెం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొక్కెరగూడేనికి చెందిన మడివి రత్నరాజు అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం వేట నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో అతనికి పసికందు రోదనలు వినిపించాయి.
వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా.. ఓ చెట్టుకు ప్లాస్లిక్ కవర్ వేలాడదీసి ఉంది. దానిలో పసికందు ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఆ పసికందును తీసుకొని రత్నరాజు తన గ్రామానికి వెళ్లి.. తల్లి ముత్తమ్మకు జరిగిన విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న కుందులూరు సబ్ సెంటర్ ఏఎన్ఎం హుటాహుటీన గ్రామానికి చెరుకొని పసికందును చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది.
ఆస్పత్రి వైద్యులు చిన్నపిల్లల వార్డులో ఉంచి అత్యవసర చికిత్సలు అందించారు. ప్రస్తుతం ఆ పసికందు క్షేమంగా ఉన్నాడు. పసికందు శుక్రవారం ఉదయమే పుట్టి ఉంటాడని, బొడ్డు కూడా కోయకుండా సంచిలో ఉంచి చెట్టుకు వేలాడదీశారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే, ఆ పసికందును అడవిలో వదిలివెళ్లింది ఎవరనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.