Borra Caves
Alluri Sitaramaraju District : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, అనంతగిరి, చింతపల్లి మండలాల్లో ఉన్న పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మూడోరోజుకు సమ్మె చేరుకుంది. బొర్రా గుహాలు వద్ద ఏర్పాటు చేసిన శిభిరంలో ఏపీటీడీసీ కార్మికులు, నాయకులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా మూడోరోజూ రిసార్టులు తెరుచుకోలేదు. సిబ్బంది సమ్మె కారణంగా మూడు మండలాల్లో ఉన్న ఐదు రిసార్టులు మూతపడ్డాయి. బొర్రా గుహల సందర్శనకు వచ్చే పర్యాటకులు నిరాశపడకూడదన్న ఉద్దేశంతో అధికారులు టికెట్ లేకుండా ఉచితంగా లోపలికి అనుమతిస్తున్నారు. అయితే, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు వెనుదిరిగిపోతున్నారు.
అరకులోయలో కార్మిక సంఘం నేతలతో ఐటీడీపీ పీవో చర్చలు జరిపారు. రెండు డిమాండ్లుకు ఓకే తెలుపగా.. మిగిలిన వాటిని మార్చిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అభిషేక్ తెలిపారు. అయితే, మంగళవారం కలెక్టర్ సమక్షంలో అధికారులు, కార్మికులతో చర్చలు జరగనున్నాయి. 2010 నుంచి పర్యాటక అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని, వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రేపు గవర్నర్ పర్యటన నేపథ్యంలో సమ్మె విరమింపజేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.