×
Ad

ఏపీలో బోర్డు తిప్పేసిన మరో బ్యాంకు.. రూ.50లక్షలతో పరార్.. ఆందోళనలో నిరుపేదలు

ఏపీలో మరో బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఘరానా మోసం చేసింది. నిరుపేదలను నిలువునా దోచుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్(amaravathi capital cooperative society bank) క్లోజ్ అయ్యింది. కూలీ నాలి చేస్తూ పేదలు పైసా పైసా జమ చేసిన డబ్బుని బ్యాంకు ప్రతినిధులు కాజేశారు. అందినకాడికి దోచుకుని అదృశ్యమయ్యారు. రాత్రికి రాత్రికే పరారయ్యారు. ఒక్క రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు ఏకంగా రూ.50లక్షల పేదల సొమ్ముకి ఎసరుపెట్టారు.

  • Published On : March 13, 2021 / 11:26 AM IST

Amaravati Capital Bank

amaravati capital bank cheating: ఏపీలో మరో బ్యాంకు బోర్డు తిప్పేసింది. ఘరానా మోసం చేసింది. నిరుపేదలను నిలువునా దోచుకుంది. కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ బ్యాంక్(amaravathi capital cooperative society bank) క్లోజ్ అయ్యింది. కూలీ నాలి చేస్తూ పేదలు పైసా పైసా జమ చేసిన డబ్బుని బ్యాంకు ప్రతినిధులు కాజేశారు. అందినకాడికి దోచుకుని అదృశ్యమయ్యారు. రాత్రికి రాత్రికే పరారయ్యారు. ఒక్క రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు ఏకంగా రూ.50లక్షల పేదల సొమ్ముకి ఎసరుపెట్టారు. అప్పనంగా వచ్చిన సొమ్ముతో వారు జల్సాలు చేస్తుంటే.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన పేదలు మాత్రం బోరుమంటున్నారు.

అమరావతి కేపిటల్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో కొంతమంది విజయవాడలో ప్రైవేట్ బ్యాంకు ప్రారంభించారు. విజయవాడ, నూజివీడు, తిరువూరు, విసన్నపేటలో బ్రాంచులు ఓపెన్ చేశారు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. తమ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే, అన్ని బ్యాంకులకంటే అధికంగా వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. అంతేకాదు, పొదుపు చేసిన సొత్తుకి డబుల్ అమౌంట్ తో రుణం కూడా ఇస్తామని నమ్మబలికారు.

దీంతో రోజువారీ కూలి పనులు చేసే వారు, చిరు వ్యాపారులు ఆ బ్యాంకులో రోజువారీగా పొదుపు చేసుకున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన పైసా పైసాని దాచుకున్నారు. ఇలా ఏడాది గడిచిన తర్వాత డిపాజిట్ చేసిన డబ్బుపై వడ్డీ చెల్లించ లేదు. పైగా దాచుకున్న డబ్బుకి రెండింతలు రుణం ఇస్తామని నమ్మబలికిన బ్యాంకు ప్రతినిధులు తర్వాత మాట మార్చారు. దీంతో బాధితులు వారిని నిలదీశారు. కనీసం, జమ చేసిన డబ్బు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మీ డబ్బుని త్వరలోనే చెల్లిస్తామని ఖాతాదారులకు బాండ్ రాసిచ్చారు. బాండ్ పేపర్ పట్టుకుని ప్రదక్షిణలు చేసినా, ఇంత వరకు డబ్బు మాత్రం చెల్లించ లేదు. ఉన్నట్టుండి నిన్నటి(మార్చి 12,2021) నుంచి బ్యాంకు కూడా ఓపెన్ చెయ్యలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బ్యాంకు నిర్వాహాకుల కోసం గాలిస్తున్నారు.