ప్రేమ విఫలమై కెనడాలో ప్రణయ్ ఆత్మహత్య

  • Publish Date - November 16, 2020 / 05:53 PM IST

Anantapur young man suicide at canada : ప్రేమ విఫలమై అనంతపురానికి చెందిన యువకుడు కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురంలోని కోవూరు నగర్ కు చెందిన నారాయణ స్వామి కుమారుడు ప్రణయ్(29) గత 2 ఏళ్లుగా కెనడాలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. అక్కడ అతనికి ఏపీకి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. గత కొద్ది నెలలుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈక్రమంలో పెళ్లి కూడా చేసుకోవాలను కున్నారు.

ఇరువైపులా కుటుంబ సభ్యులకు చెప్పగా, కరోనా పరిస్ధితులు సద్దు మణిగాక పెళ్లి చేసేందుకు అంగీకరించారు. అందుకోసం కెనడాలో వివాహా రిజిష్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ… అక్టోబర్ 11 నుంచి ప్రణయ్, యువతి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. అనంతరం యువతికి అమెరికా వెళ్లేందుకు వీసా లభించింది. అమెరికా వెళుతున్నందున వివాహం వాయిదా వేసుకుంటున్నట్లు యువతి చెప్పింది.


అప్పటి నుంచి ఆమె, ప్రణయ్ కు దూరంగా ఉండ సాగింది. దీనికి తోడు ఆయువతి మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించాడు ప్రణయ్. ఈపరిస్ధితుల్లో తీవ్ర మనో వేదనకు గురైన ప్రణయ్ విషవాయువులు పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాం శనివారం అనంతపురం చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.