కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ పిలుపునిచ్చారు. సోమవారం(ఏప్రిల్-13,2020) రాష్ట్ర ఎన్నికల కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల యథాతథ స్థితిని అధికారులు ఎన్నికల కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపన లో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరాలని స్థానిక సంస్థలను ఏర్పాటు చేశారన్నారు.
రాష్ట్రంలో మున్సిపల్, జడ్పీటీపీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ లకు ఎన్నికల ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చిన అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. సమయానుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కీలక భూమిక పోషిస్తుందని జస్టిస్ కనగరాజ్ తెలిపారు.(జలియాన్ వాలాబాగ్ ఘటనకు నేటికి 101ఏళ్లు)
కాగా,ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించడంతో మొన్నటివరకు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీ పదవినుంచి వైదొలగాల్సివచ్చింది. నిమ్మగడ్డ రమేష్ స్థానంలో తమిళనాడు హైకోర్టు రిటైర్ట్ జడ్డి కనగరాజ్ ను నూతన ఎన్నికల కమిషనర్ గా ఏపీ సర్కార్ నియమించిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం కనగరాజ్ ఏపీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.